వైసీపీని తక్కువ అంచనా వేస్తే అంతే మరి!

Bonda Uma TDP controversy

అడుసు తొక్కనేల కాలు కడుగనేల?అన్నట్లు టీడీపి సీనియర్ నేత, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పరిస్థితి కూడా సరిగ్గా ఇదే.

కాపుల పేరుతో రాజకీయాలు చేస్తూ కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్న వైసీపీ నేతలు, ముద్రగడ సంస్మరణ సభకు వస్తారని ఆయనకి తెలుసు.

ADVERTISEMENT

సిఎం చంద్రబాబు నాయుడుని బహిరంగంగా దూషించే వైసీపీ నేత అంబటి రాంబాబుతో ఆ సభలో బొండా ఉమా కబుర్లు చెప్పడం అబద్దం కాదు. ఆ సభలో వైసీపీ నేతలని కలవడం అబద్దం కాదు. వీటితోనే అయన పార్టీ గీత దాటారు.

ఇందుకు పార్టీ సంజాయిషీ కోరితే అయన కొన్ని వ్యాఖ్యలు చేయడమూ నిజమే. కానీ తాను ఆ సభకు వెళ్ళడం, అక్కడ వైసీపీ నేతలని కలవడంపై కొన్ని దుష్ట శక్తులు అసత్య ప్రచారాలు చేశాయని, మీడియా తన వ్యాఖ్యలని వక్రీకరించిందని బొండా ఉమా చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.

ఇకపై పార్టీ గీత దాటనని మళ్ళీ ఎన్నడూ వైసీపీ నేతలను కలవనని బొండా ఉమా టీడీపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు, మంత్రి నిమ్మల రామానాయుడికి హామీ ఇచ్చారు.

పార్టీలోను, రాష్ట్ర రాజకీయాలలోని సీనియర్ నాయకులలో బొండా ఉమా ఒకరు. కానీ తాజా పరిణామాలు అయన విశ్వసనీయతని ప్రశ్నార్ధకంగా మార్చాయని చెప్పక తప్పదు. ఇప్పుడు పార్టీలో అందరూ అయనని అనుమానంగా చూడకుండా ఉంటారా? అలా చూస్తుంటే ఆయన భరించగలరా?అని ఆలోచిస్తే, రాజకీయాలలో ఉన్నవారికి విశ్వసనీయత ఎంత ముఖ్యమో అర్ధమవుతుంది.

ఒకే ఒక్క తప్పటడుగుతో అది ఎంత వేగంగా పోతుందో కూడా అర్ధమవుతుంది. ఒకసారి నమ్మకం పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ దానిని తిరిగి పొందడం ఎంత కష్టమో రాబోయే రోజుల్లో ఆయనకే తెలుస్తుంది.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, రాజకీయాలు చేయడంలో టీడీపి కంటే వైసీపీ ఎల్లప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుందని ఈ పరిణామాలతో నిరూపించి చూపింది.

కులం పేరుతో వైసీపీ చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని బొండా ఉమాతో సహా అందరికీ తెలుసు. టీడీపిలో కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులు చాలా మందే ఉన్నప్పటికీ, వారెవరికీ తెలియకుండా ఇలా చిచ్చు పెట్టడమే ఇందుకు నిదర్శనం.

కనుక బొండా ఉమా వంటి ఓ సీనియర్ నేత పార్టీకి సంజాయిషీ ఇచ్చుకోవడం, ఆయనని సంజాయిషీ కోరడం చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లే అనిపిస్తుంది.

ఏది ఏమైనప్పటికీ టీడీపితో సహా మూడు పార్టీల నేతలు కూడా దీనిని ఓ గుణపాఠంగా స్వీకరించి మరింత అప్రమత్తంగా ఉండటం చాలా అవసరమని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories