కాంగ్రెస్ ప్రభుత్వం నెంబర్ 2 గా వెలిగిన అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ. విభజన అందరి కాంగ్రెస్ నాయకుల లాగానే ఆయన కొంపముంచింది. అందరి కాంగ్రెస్ నాయకుల లాగా వేరే పార్టీకి మారకుండా ఆయన ఆ పార్టీ తరఫునుండే 2014 ఎన్నికలలో పోటీ చేశారు. అయితే ఆయన, ఆయనతో పాటు తన కుటుంబసభ్యులు కూడా ఎన్నికలలో ఓడిపోయారు. రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో గత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. అయితే, చీపురపల్లిలో మాత్రం కాంగ్రెస్ నుంచి పోటీచేసిన బొత్స రెండో స్థానంలో నిలిచారు. ఎన్నికల తరువాత ఆయన ఒకప్పుడు దుమ్మెత్తి పోసిన జగన్ పార్టీలోనే చేరిపోయారు.
కాంగ్రెస్ లో అంతా తానే అయ్యి నడిపించిన బొత్స కు వైకాపాలో మాత్రం అంతటి గౌరవం దక్కలేదు. ప్రెస్ మీట్లలో చంద్రబాబుని విమర్శించుకోవడానికే ఆయనను వాడుకుంది వైకాపా. ఈ సారి ఎన్నికలలో తన కుటుంబసభ్యులకు ఐదు సీట్లు అడిగారు బొత్స అయితే జగన్ మాత్రం రెండే ఇచ్చారు. చీపురుపల్లి నుండి 2014లో ఓడిపోయిన బొత్స ఈ సారి గెలవాలని కృతనిశ్చయంతో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి కిమిడి మృణాళిని దాదాపు 23 వేల ఓట్లతో విజయం సాధించి బొత్సకు ఝలక్ ఇచ్చారు. ఆమెకు మంత్రివర్గంలోనూ చంద్రబాబు స్థానం కల్పించారు.
కిమిడి మృణాళిని చేతిలో ఓడిపోయిన బొత్స ఇప్పుడు ఆమె కుమారుడితో తలపడనున్నారు. మృణాళిని మీద కొంత వ్యతిరేకత ఉండటంతో ఆమె కుమారుడికి సీటు ఇచ్చారు చంద్రబాబు. మంచి వాగ్ధాటి కలిగిన యువకుడు కావడంతో ఆయన ప్రజలను బాగా ఆకర్షించడం బొత్సకు మింగుడుపడిని విషయమే. టీడీపీ ఆవిర్భావం తర్వాత కేవలం రెండుసార్లు మాత్రమే కాంగ్రెస్ ఇక్కడ విజయం సాధించింది. అదే 2004, 2009 ఎన్నికల్లో బొత్స సత్యన్నారాయణ కాంగ్రెస్ తరఫున పోటీచేసి విజయం సాధించారు. ఈ సారి గెలిచి హాట్ట్రిక్ సాధించాలని బొత్స ఆశపడుతున్నారు.



