ఇటీవల విజయనగరంలో జరిగిన పైడితల్లి అమ్మవారి ఉత్సవాలలో చాలా ప్రత్యేకమైన సిరిమాను ఉత్సవం చూసేందుకు చుట్టుపక్కల జిల్లాలు, రాష్ట్రాల నుంచి వేలాదిమంది తరలివస్తుంటారు. అలాగే అధికార, ప్రతిపక్ష నాయకులు కూడా.
నగరం నడిబొడ్డున బొంకుల దిబ్బ వద్ద గల గజపతుల కోట బురుజుపై ఆనంద గజపతి, కుటుంబ సభ్యులు కూర్చొని తిలకిస్తుంటారు. సమీపంలోనే మరో వేదికపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, వైసీపీ నేతలు కూర్చొని ఈ ఉత్సవం తిలకిస్తుంటారు.
ఈసారి బొత్స తదితరులు కూర్చొన్న వేదిక కాస్త క్రుంగింది. దీని వలన కాస్త ఇబ్బంది పడ్డారే తప్ప ఎవరూ గాయపడ లేదు. కానీ బొత్స సత్యనారాయణ ఈ చిన్న విషయంపై కూడా రాజకీయాలు చేస్తుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది.
విజయనగరంలో అయన మీడియాతో మాట్లాడుతూ, “నన్ను అంతమొందించాలని కొందరు కుట్ర చేస్తున్నారు. నన్ను అడ్డు తొలగించుకుంటే తమకు జిల్లాలో ఎదురుండదని కొందరు భావిస్తున్నారు. వారే ఈ కుట్ర చేసినట్లు అనుమానం కలుగుతోంది. దీనిపై విచారణ జరిపించాలని సీఎస్‌కి, గవర్నర్‌కి లేఖలు వ్రాస్తాను,” అని అన్నారు.
వేదికపైకి పరిమితికి మించి బొత్స అనుచరులు కూడా ఎక్కడంతో ఆ బరువుకి కొద్దిగా క్రుంగింది. దీనినే హత్యకు కుట్ర అని బొత్స అంటున్నారు. కొన్ని నెలల క్రితమే హార్ట్ సర్జరీ చేయించుకొని, రాజకీయాల నుంచి తప్పుకునే వయసులో ఉన్న ఆయనని అడ్డు తొలగించుకోవాలని ఎవరు కోరుకుంటారు?ఆయన కూటమి ప్రభుత్వంపై అనుమానాలు వ్యక్తం చేసే ముందు, జిల్లా వైసీపీ నాయకుల్లో ఎవరికైనా అటువంటి ఆలోచనలున్నాయేమో? పరిశీలించుకుంటే మంచిది.
ఇంత చిన్న విషయంపై రాద్దాంతం చేస్తూ మీడియా సమావేశాలు పెట్టి, లేఖలు వ్రాసి ఇంత హడావుడి చేస్తున్న బొత్స సత్యనారాయణ, రాష్ట్రపతికి కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖలు వ్రాసి సీబీఐ విచారణ కోరితే ఇంకా బాగుంటుంది. కుదిరితే ట్రంప్‌కి కూడా ఓ మెసేజ్ పెడితే ఆయన ఎఫ్‌బీఐని కూడా పంపించవచ్చు.
దశాబ్దాలుగా రాజకీయాలలో ఉన్న తన స్థాయి రాజకీయ నాయకులు ఈవిదంగా చవకబారు రాజకీయాలు చేస్తే ప్రజలు నవ్వుతారని బొత్స సత్యనారాయణ గ్రహిస్తే మంచిది.







