బ్రహ్మాస్త్రం సినిమా ఈవెంట్‌పై కేసీఆర్‌ బ్రహ్మాస్త్రం?

brahmastra-jr-ntr-kcr-bjp-controversyబాలీవుడ్‌ నటులు రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రలలో నటించిన బ్రహ్మాస్త్ర (తెలుగులో బ్రహ్మాస్త్రం) సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ శుక్రవారం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగవలసి ఉంది. రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తీసిన బ్రహ్మాస్త్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ చాలా అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జూ.ఎన్టీఆర్‌, రాజమౌళిని ఆహ్వానించారు. కానీ చివరి నిమిషంలో ఈ కార్యక్రమం రద్దు అయ్యింది.

నగరంలో గణేశ్ నిమజ్జనాలకు పోలీసులను కేటాయించడంతో బ్రహ్మాస్త్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కి భద్రత కల్పించలేమని కనుక ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవలసిందిగా పోలీస్ శాఖ సూచించింది. కనుక ఈ ఈవెంట్‌ని రద్దు చేసుకొని ప్రెస్‌మీట్‌తో సరిపెట్టుకోవలసి వచ్చింది.

ADVERTISEMENT

అయితే నిజంగానే పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేయలేకపోవడం వలననే బ్రహ్మాస్త్ర ఈవెంట్‌కు అనుమతి నిరాకరించారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే, గతంలోను ఇటువంటి సందర్భాలలో ప్రీరిలీజ్ ఈవెంట్‌లు జరిగాయి. వాటికి పోలీస్ బందోబస్తు కల్పించారు.

నిన్న జరగవలసిన ఈ కార్యక్రమానికి నిర్వాహకులు ముందుగానే పోలీసుల అనుమతి తీసుకొన్న తర్వాతే అన్ని ఏర్పాట్లు చేసుకొన్నారు. కనుక ఈ వంకతో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని రద్దు చేసుకోమని పోలీస్ శాఖ కోరిందంటే నమ్మశక్యంగా లేదని జూ.ఎన్టీఆర్‌ అభిమానులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తమ అభిమాన హీరో జూ.ఎన్టీఆర్‌ను ముఖ్య అతిధిగా ఆహ్వానించినందునే, ఈ వంకతో అనుమతి నిరాకరించి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే, ఇటీవల అమిత్‌ అమిత్‌ షా హైదరాబాద్‌ వచ్చినప్పుడు జూ.ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా హైలైట్ అయ్యింది. బిజెపి తరపున ఎన్నికలలో ప్రచారం చేయాలని కోరేందుకే అమిత్‌ షా జూ.ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారనే ఊహాగానాలు వినిపించాయి.

తెలంగాణ సిఎం కేసీఆర్‌ బిజెపిని, మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కనుక అమిత్‌ షాతో భేటీ అయినందుకు జూ.ఎన్టీఆర్‌పై ఆగ్రహంతో ఉన్నారని అందుకే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి ఈ వంకతో అనుమతించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

కానీ బ్రహ్మాస్త్ర ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న జూ.ఎన్టీఆర్‌ చాలా ఆచితూచి మాట్లాడారు. “మన భద్రత కోసమే పోలీసులు పనిచేస్తుంటారు. కనుక వారికి మనం సహకరించడం అవసరం,” అని క్లుప్తంగా చెప్పారు.

ఒకవేళ ఈ కార్యక్రమానికి అనుమతి నిరాకరించడానికి నిజంగా జూ.ఎన్టీఆర్‌పై కేసీఆర్‌ ఆగ్రహమే కారణమయ్యుంటే, ఈ విషయం తదుపరి కార్యక్రమాలలో లేదా జూ.ఎన్టీఆర్‌ తదుపరి చిత్రం విడుదలకు ముందు స్పష్టమవుతుంది. అమిత్‌ షాతో జూ.ఎన్టీఆర్‌ ఒక్క భేటీతోనే ఇంత ఎఫెక్ట్ పడి ఉంటే, సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా బిజెపి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే పరిస్థితి ఏమిటి?

Watch and subscribe for Exclusive Interviews:

ADVERTISEMENT
Latest Stories