తన పోరాటాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ అంటూ రెండు ముక్కలు చెయ్యగలిగిన కేసీఆర్ ఇప్పుడు తన కొడుకు – కూతురు రాజకీయ ఆధిపత్య పోరాటంతో బిఆర్ఎస్ పార్టీని కూడా రెండు ముక్కలు చెయ్యాల్సిన పరిస్థితిలో పడ్డారా.?
అటు కొడుకు కేటీఆర్, కూతురు కవిత చర్యల పై పూర్తి అసహనం వ్యక్తం చేస్తూ కవితను పార్టీ నుండి సస్పెండ్ చెయ్యాల్సిందే అంటూ కేసీఆర్ ను పట్టుపట్టడం, ఇటు కవిత కూడా వివాదాన్ని తెగేదాకా లాగి తనకు సింపతీ వచ్చేలా రాజకీయాన్ని నడపడం కేసీఆర్ కు ముందు నుయ్యి వెనుక గొయ్యి చందంగా మారిపోయింది
నాడు బిఆర్ఎస్ కు ప్రాణం పోసిన కాళేశ్వరం ఇప్పుడు అదే బిఆర్ఎస్ జీవం తీస్తుంది. అటు రాజకీయంగా ఇటు కుటుంబ పరంగా కాళేశ్వరం కొట్టిన దెబ్బకు కల్వకుంట్ల రెండు ముక్కలు కాకా తప్పలేదు. అలాగే బిఆర్ఎస్ చుట్టూ అవినీతి మరకలు అంటకా తప్పలేదు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారు అన్నట్టుగా కవిత వ్యాఖ్యానించడంతో నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం పై నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన అవినీతి మరకలకు కవిత ఆమోద ముద్ర వేసినట్లయ్యింది.
దీనితో పార్టీ లైన్ దాటి మరి కవిత బిఆర్ఎస్ పై ముఖ్యంగా హరీష్, సంతోష్ వంటి పార్టీ ముఖ్య నాయకుల పై పరిధి దాటి అవినీతి ఆరోపణలు చేయడంతో కవిత కు పార్టీ నుండి సస్పెన్షన్ వేటు రిటర్న్ గిఫ్ట్ గా వచ్చింది.
అలాగే కవిత కూడా యాక్షన్ కు రియాక్షన్ అన్న చందంగా సస్పెన్షన్ ప్రకటన వచ్చిన కొద్ది సేపటికే బిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే పార్టీ నుండి పొందిన ఎమ్మెల్సీ పదవి విషయంలో కవిత ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అన్నట్టుగా సమాచారం.
నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో 2022 లో ఎమ్మెల్సీ గా ఎన్నికైన కవిత తన పదవి కాలాన్ని 2028 వరకు కొనసాగిస్తారా లేక పార్టీతో పూర్తిగా సంబంధాలు తెచ్చుకోవడానికి తన శాసన మండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారా.? అన్న దాని పై తన జాగృతి శ్రేణులతో చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
కవిత లేఖ లీక్ తో మొదలైన బిఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు నేడు కాళేశ్వరం విషయంలో కేసీఆర్ పై సీబీఐ విచారణ తో తార స్థాయికి చేరింది. మరి ఈ మంటలు బిఆర్ఎస్ ను రాజకీయంగా దెబ్బ తీస్తాయా.? లేక కవితను రాజకీయంగా సమాధి చేస్తాయా అన్నది కాలమే బదులు చెప్పగలదు.





