తెలంగాణలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు తెలంగాణ శాసనసభ కార్యాలయం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే రెంటికీ కలిపి ఒకే నోటిఫికేషన్ జారీ చేసి ఉంటే బిఆర్ఎస్ పార్టీ కనీసం ఒక సీటు గెలుచుకోగలిగి ఉండేది. కానీ నిబంధనల ప్రకారం రెంటికీ వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేయడంతో ఈ రెండు సీట్లు బిఆర్ఎస్ చేజారిపోతున్నాయి.
ఏవిదంగా అంటే, రెండు సీట్లకు ఒకే నోటిఫికేషన్ జారీ అయితే అప్పుడు ఒకే ఎన్నికగా పరిగణింపబడుతుంది. శాసనసభలో గవర్నర్ కోటాలో రెండు సీట్లు మినహాయిస్తే 117 స్థానాలు ఉన్నందున ఒక్కో ఎమ్మెల్సీని గెలిపించుకునేందుకు కనీసం 58-59 ఎమ్మెల్యేల మద్దతు అవసరం.
బిఆర్ఎస్ పార్టీకి 39మంది, మజ్లీస్ 7మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌కు బీజేపీ మద్దతు ఇవ్వదు కనుక ఆ పార్టీని ఒప్పిస్తే మరో 8 మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తుంది. అంటే 54 మంది ఎమ్మెల్యేలు అవుతారు. అప్పుడు మరో 4-5 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత క్రాస్ ఓటింగ్ చేయించగలిగితే బిఆర్ఎస్ ఒక్క ఎమ్మెల్సీని గెలిపించుకునే అవకాశం ఉంటుంది.
కానీ రెండు స్థానాలకు వేర్వేరుగా నోటిఫికేషన్ జారీ చేసినందున, ఇప్పుడు అవి వేర్వేరుగా ఎన్నికలుగా పరిగణింపబడతాయి. కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేలు, ఓ సీపీఐ ఎమ్మెల్యే కలిపి 65 మంది ఉన్నారు. కనుక మొదట 65 మందితో ఒక ఎమ్మెల్సీని , మళ్ళీ అదే 65 మందితో మరో ఎమ్మెల్సీని గెలిపించుకోగలుగుతుంది.
బిఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేయడం వలన ఖాళీ అయిన ఈ రెండు సీట్లు ఇప్పుడు కాంగ్రెస్ హస్తగతం కాబోతున్నాయి.
కాంగ్రెస్‌కు అదృష్టం కలిసివస్తే, బిఆర్ఎస్‌ని నోటిఫికేషన్ల రూపంలో దురదృష్టం వెంటాడిందనుకోవచ్చు. కేసీఆర్ చేసిన యాగాలు, పూజలు, వాస్తు మార్పులు ఏవీ ఆయనకు ఫలించకపోగా కాంగ్రెస్‌కు లబ్ధి కలుగుతుండటం చాలా ఆశ్చర్యంగానే ఉంది!




