పుణ్యకాలం ముగుస్తుంటే బుగ్గన కాకి లెక్కలు ఇప్పుడు ఎందుకు?

Minister Buggana Rajendranath

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రుల పేర్లు ప్రజలందరికీ తెలుసు. కానీ వారు ఏ శాఖకు మంత్రి అంటే చాలామంది సమాధానం చెప్పలేరు. ఎందుకంటే వారిలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వంటి ఒకరిద్దరు మినహా మిగిలినవారు ఎవరూ తమ మంత్రిత్వ శాఖల గురించి ఎన్నడూ మాట్లాడిన దాఖలాలు లేవు కనుక.

ADVERTISEMENT

మంత్రి బుగ్గన ఎప్పుడో ఓసారి మీడియా ముందుకు వచ్చినా ఆయన రాష్ట్ర ఆర్ధిక స్థితిపై కాకి లెక్కలు చెపుతుంటారు కనుక ప్రజలందరూ ఆయన ఆర్ధికశాఖా మంత్రి అని గుర్తుంచుకున్నారు.

మళ్ళీ చాలా రోజుల తర్వాత బుగ్గన మీడియా ముందుకు వచ్చి ఏపీ ఆర్ధిక పరిస్థితి దివ్యంగా ఉందని సర్టిఫికేట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అప్పుల ఊబిలో మునిగిపోయిందని ప్రతిపక్షాలు, వాటి మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని వాటిని నమ్మవద్దని తాను చెప్పే కాకి లెక్కలనే నమ్మాలన్నారు.

ఐదేళ్ళ టిడిపి పాలనలో రాష్ట్రం అప్పులు 22 శాతం పెరిగితే, నాలుగున్నరేళ్ళ వైసీపి పాలనలో కేవలం 12 శాతం మాత్రమే పెరిగాయని బుగ్గ నొక్కి చెప్పారు. ఇంకా నాటివీ… నేటివీ స్థూల ఉత్పత్తి, అప్పులు, పీఎఫ్ ఖాతాలు, నిష్పత్తులు, శాతాలు అంటూ బుగ్గన కొన్ని నంబర్లు చెప్పారు.

నాటితో పోలిస్తే ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలలో సొమ్ము ఇప్పుడు రూ.15,92,000 కోట్లు పెరిగిందంటే రాష్ట్రంలో ఉద్యోగాల సంఖ్య పెరిగిన్నట్లా కాదా?అనే ప్రశ్నకు అందరూ బుగ్గన వేలేసుకోక తప్పదు.

ఎందుకంటే ఈ నాలుగున్నరేళ్ళలో రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు రాకపోగా ఉన్నవి కూడా బయటకు వెళ్లిపోతుంటే, రాష్ట్రంలో ఉద్యోగాలు ఎలా లభిస్తాయి?ఉద్యోగాలే లేనప్పుడు పీఎఫ్ సొమ్ము ఎలా పెరిగిపోతుంది? కనీసం రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ తీసినా బుగ్గన ఈ మాట చెప్పుకొన్నా అర్దం ఉంటుంది. కానీ ఇంతవరకు అదీ తీయలేదే?

ప్రతిపక్షాలు చెపుతున్న లెక్కలకు ఆధారాలు ఏవీ? అని ప్రశించిన బుగ్గన తాను చెప్పే కాకి లెక్కలకు ఆధారాలు చూపించి ఉంటే బాగుండేది కదా?ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా అప్పులు చేయగలమా? చేసినా దాచిపెట్టగలమా?అని బుగ్గన ప్రశ్నించారు.

నిజమే! వైసీపి ప్రభుత్వం వాటికి తెలిసే అప్పులు చేస్తోందని అందరికీ తెలుసు. కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఏపీ అప్పులు, ఆర్ధిక పరిస్థితి గురించి చెప్పిన గణాంకాలకు బుగ్గన జవాబు ఏమిటి?

ఏపీ ఆర్ధిక పరిస్థితి అంత దివ్యంగా ఉంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నెలనెలా సకాలంలో జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు. జీతాలు పెంచమని సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు, ఆశా వర్కర్లకు, మునిసిపల్ సిబ్బందికి ఎందుకు జీతాలు పెంచలేకపోతోంది? ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందిస్తున్న ఆస్పత్రులకు వెయ్యి కోట్లు బకాయిలు ఎందుకు పెట్టిన్నట్లు? బుగ్గన వివరణ ఇస్తే బాగుండేది.

అయినా వైసీపి పుణ్యకాలం ముగిసిపోతున్నప్పుడు ఇప్పుడు ఈ కాకి లెక్కలు చెప్పి ఏం ప్రయోజనం?ఈ కాకి లెక్కలతో ఇంకా ఎవరిని మభ్యపెట్టాలని?

ADVERTISEMENT
Latest Stories