పార్లమెంట్ చేసిన చట్టాలను సుప్రీంకోర్టు అడ్డుకోగలదా?

Supreme Court of India and Parliament of India

రాష్ట్రపతి, పార్లమెంట్, సుప్రీంకోర్టు.. మన దేశంలో, మన రాజ్యంగంలో అత్యున్నత స్థానంలో ఉంటాయి. భారత్‌ రాజ్యాంగం వ్రాస్తున్నప్పుడే వాటి పరిధి, అధికారాలు, బాధ్యతలు చాలా స్పష్టంగా నిర్వచించి విభజన రేఖలు గీశారు.

అలాగే ఒకరి పరిధిలో మరొకరు ప్రవేశించాల్సి వచ్చినప్పుడు ఏవిదంగా వ్యవహరించాలో కూడా రాజ్యాంగంలో ముందే స్పష్టంగా పేర్కొన్నారు.

ADVERTISEMENT

మన రాజ్యాంగంలో ఇంత నిర్దిష్టంగా పేర్కొనందునే ఇంతకాలం ఈ మూడు అత్యున్నత వ్యవస్థల మద్య పెద్దగా సమస్యలు ఏర్పడలేదు.

కానీ రాష్ట్రపతి, గవర్నర్ పరిధి, అధికారాలని ప్రశ్నిస్తున్నట్లు ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం ప్రకంపనలు సృష్టిస్తోంది.

తమిళనాడు ప్రభుత్వం పది బిల్లులు గవర్నర్ ఆమోదం కొరకు పంపితే, వాటిపై రాష్ట్రపతి అభిప్రాయం అవసరమని తొక్కి పట్టారు.

తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయగా, ‘తమ ఆమోదం కోసం వచ్చిన దస్త్రాలను రాష్ట్రపతి, గవర్నర్ తప్పనిసరిగా నిర్ధిష్ట గడువులోగా పరిష్కరించి పంపాలని, లేకుంటే వాటికి ఆమోదం లభించిన్నట్లే అని, అవసరమైతే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని నిర్ణయం తీసుకుంటుందని, ఆ అధికారం తమకు ఉందని సుప్రీంకోర్టు తాజా తీర్పులో చెప్పింది.

ఈ తీర్పు ఆధారంగా తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ ఆమోదం లేకుండానే ఆ 10 బిల్లులకు చట్టరూపం కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం లేకుండా చట్టాలు అమలుచేయడం, అందుకు సుప్రీంకోర్టు మార్గం సుగమం చేయడం ఓ దుస్సంప్రదాయమని కేరళ గవర్నర్ అన్నారు.

ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కూడా ఇంచుమించు అటువంటి అభిప్రాయమే వ్యక్తం చేస్తూ, దేశంలో సర్వోన్నత స్థానంలో ఉండే రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం ఏమిటని ప్రశ్నించారు.

ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులతో ఏర్పడే పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వం దేశప్రజలకు జవాబుదారీగా ఉంటుంది తప్ప సుప్రీంకోర్టు కాదు. అటువంటప్పుడు రాష్ట్రపతి అధికారాలను సుప్రీంకోర్టు ఏవిదంగా ప్రశ్నించగలదు?

పార్లమెంటులో చేసే చట్టాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు, హైకోర్టులు తీర్పులు చెప్పాలి తప్ప చట్ట సవరణలపై సొంత అభిప్రాయాలతో తీర్పులు చెప్పడం రాష్ట్రపతి, పార్లమెంట్ అధికారాలలో జోక్యం చేసుకోవడం సరికాదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు.

అధికారంలో ఉన్న పార్టీలు కొన్నిసార్లు తమ రాజకీయ అవసరాలు లేదా రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చట్టాలు చేస్తుంటాయి. వక్ఫ్ చట్ట సవరణ, మైనార్టీలకు, బీసీలకు రిజర్వేషన్స్ పెంచుతూ చేసిన చట్టాలు అటువంటివే అని ప్రతిపక్షాలే వాదిస్తుంటాయి.

అటువంటి సందర్భాలలో న్యాయస్థానాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేలెత్తి చూపుతుంటాయి. కానీ పార్లమెంట్‌లో చేసిన చట్ట సవరణలని రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత ప్రజా శ్రేయస్సు దృష్ట్యా వాటిని న్యాయస్థానాలు అడ్డుకోవడం రాజ్యాంగ సమ్మతమేనా కదా?అనే ప్రశ్నలకు జవాబు చెప్పడం కష్టం.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పార్లమెంట్, శాసనసభ, న్యాయస్థానాలు రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, నైతిక విలువలకి కట్టుబడి నిర్ణయాలు తీసుకుంటే ఇటువంటి సంకట స్థితి రాదు. కానీ అవన్నీ పాటించడం కష్టం కనుక ఇటువంటి సమస్యలు వస్తూనే ఉంటాయి.

ADVERTISEMENT
Latest Stories