
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఏపీలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ ఆ ఐదేళ్లు రాష్ట్రానికి చేసిందేమిటో ప్రజలకు చెప్పుకోవడంలో పూర్తిగా విఫలమయ్యిందనే చెప్పాలి.
2014 -19 నిర్దిష్ట ఐదేళ్ల పరిమితి కాలంలో రాజధాని ఎంపిక, రాజధాని నిర్మాణ అనుమతులు, పోలవరం పూర్తి కి కావలసిన గ్రామాల విలీనం, అందుకు తగ్గ కేంద్ర ప్రభుత్వ అనుమతులు, పట్టిసీమ తో నదుల అనుసంధానం, శ్రీ సిటీ వంటి నిర్మాణాలు ఇలా ఎన్నో అభివృద్ధి పనులకు ఏపీ సాక్షిగా నిలిచింది.
అలాగే రాజధాని వెలగపూడిలో సచివాలయ ఏర్పాటు, హై కోర్ట్ నిర్మాణం, ఎయిమ్స్, విట్, ఎస్ఆర్ఎం వంటి ప్రతిష్టాత్మకమైన వసతులు, రవాణా రంగం పటిష్టత, గ్రామీణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వంటి ఎన్నో కార్యక్రమాలను గత టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసింది.
Also Read – జగన్‌కి ఓదార్పు కావాలి.. ఎవరైనా ఉన్నారా ప్లీజ్?
దానికి తోడు హుదూద్ వంటి విపత్తుల ఎదురీత, ప్రత్యర్థి పార్టీల రాజకీయ కుయుక్తులు, పొరుగు రాష్ట్రాల పంచాయితీలు ఇలా ఎన్నో సమస్యలను మోస్తూ కూడా రాష్ట్రానికి కియా, ఎంఐ వంటి ఎన్నో పరిశ్రమలను ప్రారంభించింది. అలాగే గన్నవరం ఎయిర్ ఫోర్ట్ అభివృద్ధి, మచిలీపట్టణం ఫోర్ట్ పనులకు పునాదులు వేసింది.
రాష్ట్ర విభజనతో రోడ్డున పడ్డ పాలనా వ్యవస్థను గాడిన పెట్టింది. అప్పులతో జీవితం మొదలు పెట్టిన నవ్యాంధ్రప్రదేశ్ ను సన్ రైజ్ స్టేట్ గా ప్రచారం చేస్తూ ఆదాయ మార్గాలను సృష్టించారు. అలాగే సింగపూర్ వంటి అభివృద్ధి చెందిన దేశాల దిగ్గజాలను ఏపీ అభివృద్ధిలో భాగం చేసింది. అయితే ఇదంతా కూడా 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఏపీ పరిస్థితి.
Also Read – అన్న వచ్చాడు…చెల్లి రాలేదే.?
అయితే 2019 లో అధికారాన్ని చేపట్టిన వైసీపీ నవరత్నాల పేరుతో ఏపీ ఆదాయాన్ని వైసీపీ రాజకీయంలో తాకట్టు పెట్టి, కక్ష్య రాజకీయాలను ఏపీ కి పరిచయం చేస్తూ పారిశ్రామిక వేత్తలను రాష్ట్ర సరిహద్దులు దాటించారు. అలాగే మూడు రాజధానులు అంటూ రాష్ట్ర ఆత్మ గౌరవం మీద కొట్టి ఏపీని అనాధల నిలబెట్టారు. గత టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధికి వైసీపీ రంగులేసి ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేసారు.
అలాగే రాజధాని అమరావతి మీద విషం చిమ్మి ఏపీ భవిష్యత్ పునాదులను సమాధులుగా మార్చారు. బాబు, ప్రజలు తనకిచ్చిన ఐదేళ్లను అభివృద్ధికి వెచ్చించి నిర్మాణాలను చేయపడితే, జగన్ తనకొచ్చిన ఒక్క ఛాన్స్ అవకాశాన్ని విధ్వంసానికి వినియోగించి కూల్చివేతలకు పునాదులు వేశారు.
2024 లో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ కూటమి గత ఐదేళ్ల వైసీపీ అరాచకాలను ప్రజలకు సరైన రీతిలో వివరించలేకపోతుంది. కేవలం బాబు మీద ఉన్న ద్వేషం, టీడీపీ మీదున్న రాజకీయ వైరంతో ఎన్నోవేలకోట్లు వెచ్చించి నిర్మించిన అమరావతి నిర్మాణ పునాదులను నీటిపాలు చేసి ప్రజల ఆస్తికి తుప్పు పట్టించారు.
రాజధానిలో ఏర్పాటు చేయబోతున్న శాశ్వత భవన నిర్మాణాలకు గాను తీసిన లోతైన పునాదులతో నీటి నిల్వలను పట్టించుకోకుండా వాటిని చెరువుల మాదిరి తయారు చేసిన ఐదేళ్ల వైసీపీ పాపాన్ని టీడీపీ ప్రజలకు వివరించలేకపోతుంది. అలాగే అమరావతిని అరణ్యంలా మార్చిన వైసీపీ మూర్కత్వన్ని సరైన తీరులో ఎండగట్టలేకపోతుంది.
వదిలేసినా బకాయిలు, ఎగ్గొట్టిన పెండింగ్ బిల్లులు, చేసిన అప్పులు, తాకట్టు పెట్టిన ఆస్తులు ఇలా ఏ వ్యవస్థలో చూసినా, ఏ శాఖలో విన్నా అంతా వైసీపీ అవినీతి, జగన్ అక్రమాలే కనిపిస్తున్నాయి. రాజధానిని ముంచేశారు, పోలవరాన్ని పక్కన పెట్టారు, విశాఖను భూ దందాలకు వినియోగించుకున్నారు, కర్నూల్ ను రాజకీయ అవసరాలకు వాడుకున్నారు. బూతులు తప్ప విలువలు లేని వైసీపీ రాజకీయం ఏపీకి అత్యంత ప్రమాదకారం అనేది అందరికి తెలియాలి.
గత టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక, ప్రజలకు వివరించడంలో విఫలమయ్యి ఓటమిని ఎదుర్కున్న టీడీపీ కనీసం ఈసారైనా గత ఐదేళ్ల వైసీపీ విధ్వంసాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలి. కానీ టీడీపీ ఆ పనిని పూర్తిగా చేస్తుందా అంటే లేదనే చెప్పాలి. అలాగే గత ఐదేళ్లు తమను తమ పార్టీని అవహేళన చేసిన నేతలకైనా బుద్ధి చెప్పగలిగిందా అంటే ఆ విషయంలో కూడా టీడీపీ కార్యకర్తలకు అసంతృప్తినే మిగిల్చింది. దీనితో టీడీపీ తన రాజకీయ తప్పిదాన్నీ సరిదిద్దుకోలేకపోతుందా అనిపిస్తుంది.
తాను చేసిన మంచిని ప్రచారం చేసుకోవడం ఎంత అవసరమో అలాగే ఇతరులు చేసిన చెడును చూపించడం కూడా రాజకీయాలలో అంతే కీలకం. టీడీపీ కానీ బాబు కానీ ఆ విషయంలో చాల వెనకబడ్డారనే చెప్పాలి. ఇప్పటికైనా టీడీపీ కళ్ళు తెరిచి తమకిచ్చిన మరో ఐదేళ్ల అవకాశాన్ని సరైన పద్డతిలో వినియోగించుకుంటూ చేస్తున్న అభివృద్ధి పనులు, తొలగిస్తున్న ఐదేళ్ల వైసీపీ పాపాలను ప్రజల ముందు ఆవిష్కరించాలి. అప్పుడే అభివృద్ధికి ఐదేళ్ల సమయం సరిపోదని, అరాచకానికి ఐదునెలలైనా చాలు అనే వ్యత్యాసాన్ని ప్రజలు గమనించగలుగుతారు.