వైఎస్ జగన్ మామపై కేసు… అరెస్ట్ కోసం గాలింపు..!

YSRCP MLA Ravindranath reddyవైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మామ, పార్టీ సీనియర్ నేత, కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై నమోదైన భూకబ్జా కేసులో అరెస్ట్ చేసేందుకు సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. 2012లో నమోదైన ఈ కేసు దాదాపుగా మూసివేసిన స్థాయిలో ఉండగా, ఇటీవలే ఈ కేసు ఫైలుకు పోలీసులు బూజు దులిపారు. కేసు రిజిష్టర్ అయిన సందర్భంగా సేకరించిన ఆధారాలతో పాటు తాజాగా మరికొన్ని ఆధారాలను సేకరించిన పోలీసులు రవీంద్రనాథ్ రెడ్డి భూకబ్జాకు పాల్పడినట్లుగా నిర్ధారించారు. దీంతో ఈ కేసులో ఏ-5 నిందితుడిగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధం చేయగా, మరో ముగ్గురు కీలక నిందితులను గతంలోనే అరెస్ట్ చేశారు.

ADVERTISEMENT

రాష్ట్ర విభజనకు ముందు మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో మెహిదీపట్నానికి చెందిన దామల చెరువు ప్రమీల అనే వృద్ధురాలి పేరిట సర్వే నెంబరు 11/30లో ప్లాట్ నెంబరు 864లో 300 చదరపు గజాల స్థలం ఉంది. అయితే కబ్జాకోరులు ఈ భూమిని సొంతం చేసుకునేందుకు యత్నించగా, ఈ క్రమంలో కర్నూలు జిల్లాకు చెందిన శీనం ప్రతాప్ రెడ్డి, గోపవరపు నర్సింహారెడ్డి, రాజిరెడ్డిలతో పాటు హైదరాబాద్ లోని ఆల్వాల్ కు చెందిన ప్రతాప్ రెడ్డి రంగంలోకి దిగారు. సదరు స్థలానికి సంబంధించిన నకిలీ పత్రాలను సృష్టించి, ఫోర్జరీ సంతకాలతో ఆ స్థలం తమదేనని ప్రకటించుకుని, పనిలో పనిగా చుట్టుపక్కల ఉన్న ప్లాట్లను కూడా ఆక్రమించేశారు.

ఆ తర్వాత శీనం ప్రతాప్ రెడ్డికి రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడి బ్యాంకు ఖాతా ద్వారా 25 లక్షలు చెల్లించి సదరు భూమిని వైసీపీ నేత కొనుగోలు చేశారు. చివరగా ఆ భూమిని రవీంద్రనాథ్ రెడ్డి స్వయంగా తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనిని ప్రశ్నించిన భూ యజమాని ప్రమీలను నిందితులు భయభ్రాంతులకు గురిచేశారు. ఈ క్రమంలో తన స్థలం కబ్జాకు గురైందని తెలుసుకున్న ప్రమీల, 2012 ఏప్రిల్ 7న మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది.

అయితే నాడు తనకున్న రాజకీయ పలుకుబడితో రవీంద్రనాథ్ రెడ్డి కేసు దర్యాప్తును అడ్డుకున్నారన్న వాదనలు వ్యక్తమయ్యాయి. కానీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత, భూదందాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం భూవివరాలపై ఓ కన్నేసింది. అదే సమయంలో పోలీస్ స్టేషన్లలో భూ పంచాయతీలకు అడ్డుకట్ట వేసేందుకు సైబరాబాదు కమిషనర్ ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్ఓపీ) కూడా రూపొందించారు. ఈ క్రమంలో ఇటీవల మాదాపూర్ ఇన్ స్పెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన కళింగరావు… ఈ కేసును తిరగదోడి, ఎస్ఓపీ నిబంధనల ప్రకారం ప్రమీలతో పాటు ప్రతాప్ రెడ్డి ముఠా ఇచ్చిన పత్రాలను పరిశీలించారు.

ఆ భూమికి సంబంధించి రెండు వర్గాలు అందించిన పత్రాలను సంబంధిత కార్యాలయాలకు పంపారు. ఈ పరిశీలనలో ప్రమీల ఇచ్చిన పత్రాలే నిజమైనవని, ప్రతాప్ రెడ్డి ముఠా ఇచ్చిన పత్రాలు నకిలీవని తేలిపోయింది. దీంతో ప్రతాప్ రెడ్డి ముఠాకు చెందిన శీలం ప్రతాప్ రెడ్డి, గోపవరపు నర్సింహారెడ్డి, రాజిరెడ్డిలను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఐదో నిందితుడిగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డిని ‘పరారీలో ఉన్న నిందితుడు’గా పోలీసులు పేర్కొన్నారు. అంతేకాక రవీంద్రనాథ్ రెడ్డి అరెస్ట్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు మాదాపూర్ పోలీసులు తాజాగా ప్రకటించారు.

ADVERTISEMENT
Latest Stories