సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మినారాయణ ఇటీవల శ్రీశైలంలో తాను చదువుకొన్న పాఠశాల పూర్వ విద్యార్దుల సమావేశానికి హాజరైనప్పుడు జగన్ ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలలో పెను మార్పులు తెస్తోందంటూ ప్రశంశలు కురిపించారు.
ఒకప్పుడు అక్రమాస్తుల కేసులలో జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించిన ఆయన ఇప్పుడు జగన్‌ను ప్రశంశించడంతో ఆయన వైసీపిలో చేరబోతున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. నిజానికి ఇదివరకే తనకు వైసీపి నుంచి ఆహ్వానం వచ్చిందని, కానీ తాను సున్నితంగా తిరస్కరించానని ఆయనే స్వయంగా ఓ సందర్భంలో చెప్పారు. కనుక ఆయన వైసీపిలో చేరబోతున్నారని భావించడం సహజం. అయితే ఈ వార్తలపై ఆయన ఘాటుగా స్పందించారు.
తాను యాదృచ్ఛికంగా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిని వైద్య శిబిరంలో ఉన్నప్పుడు కలిశానని, ఆ సందర్భంగా తాను ఆ కార్యక్రమాలు బాగున్నాయని మెచ్చుకొన్నానని అన్నారు. అంతమాత్రన్న తాను వైసీపిలో చేరబోతున్నానని, ఎన్నికలలో వైసీపి అభ్యర్ధిగా పోటీ చేయబోతున్నానని తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదంటూ ట్వీట్ చేశారు.
ఆయన ఏమన్నారో ఆయన మాటలలోనే… “శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ శిల్పా చక్రపాణి గారిని మా పూర్వ విద్యార్థుల కార్యక్రమానికి ఆహ్వానించడానికి కలిశాను. అక్కడే వైద్య పరీక్షలకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమానికి ఆయన నన్ను ఆహ్వానించారు. ఆ సమావేశంలో నేను వైద్య శిబిరాలు, నాడు-నేడు కార్యక్రమాలను అభినందించాను. అంతమాత్రాన నేను అధికార పార్టీలో చేరుతున్నానని, వచ్చే ఎన్నికల్లో వారి టిక్కెట్టుపై పోటీ చేస్తానంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదు. ఈ ఊహాగానాలలో ఏ మాత్రం నిజం లేదు… ప్రజలు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఓటర్ల చైతన్య కార్యక్రమం కొనసాగించే నా పోరుబాటకు కట్టుబడి ఉన్నాను,” అని లక్ష్మినారాయణ ట్వీట్ చేశారు.
పోరుబాటకు కట్టుబడి ఉన్నప్పుడు వైసీపి పాలనలో అరాచకాలు, అవినీతి గురించి రెండు ముక్కలు ప్రస్తావించి ఉంటే బాగుండేది. లేదా చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందించి ఉంటే బాగుండేది. బీజేపీ లేదా మళ్ళీ జనసేనతో కలిసి ముందుకు సాగుతానని చెప్పి ఉండవచ్చు. బహుశః ఇది సమయం సందర్భం కాదని ఆ ప్రస్తావన చేసి ఉండకపోవచ్చు. కానీ ఆయన ఏ గట్టున ఉన్నారో చెపితే ప్రజలు, ఆయన అభిమానులు కూడా సంతోషిస్తారు కదా?




