సజ్జల చెప్పిందే అవినాష్ రెడ్డి చెప్పారంటే…

MP Avinash Reddyవివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని శుక్రవారం హైదరాబాద్‌కి పిలిపించుకొని సుమారు 4 గంటలసేపు ప్రశ్నల వర్షం కురిపించారు.

ADVERTISEMENT

అనంతరం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఈ కేసుకి సంబందించి సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పి వారికి నాకు తెలిసిన విషయాలని వివరించాను. అయితే సీబీఐ విచారణ నన్ను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్నట్లనిపిస్తోంది. వారు వాస్తవాలని వెలికితీసేందుకు కాక ఈ కేసులో నన్ను ఇరికించేందుకే విచారణ జరుపుతునట్లు నాకు అనిపిస్తోంది.

ఆనాడు టిడిపి చెప్పిన విషయాలనే నేడు సీబీఐ ‘గూగుల్ టేకౌట్’ పేరుతో ప్రశ్నించడం గమనిస్తే, ఈ కేసు విచారణపై రాజకీయ ప్రభావం చాలా ఉన్నట్లు అనుమానం కలుగుతోంది. వివేకా చనిపోయిన తర్వాత మీడియాతో మొట్టమొదట మాట్లాడిన వ్యక్తినే నేనే. ఆరోజు నేను మాట్లాడిన మాటలకి నేటికీ నేను కట్టుబడి ఉన్నాను. ఈ కేసు విచారణకి సంబందించి నాకు అనేక అనుమానాలున్నాయి. అదే విషయం నేను సీబీఐ అధికారులకి తెలియజేసి సమాధానాలు కోరాను.

ఇక సీబీఐతో పాటు మీడియా కూడా ఈ కేసు విచారణ చేస్తూ నన్ను నేరస్థుడిగా తీర్పు చెప్పేసింది. ఒక అబద్ధాన్ని జీరో నుంచి వందకి పెంచి, నిజాలని వంద నుంచి జీరో చేసేందుకు ప్రయత్నిస్తోంది. తద్వారా ఈ కేసు విచారణని ప్రభావితం చేసేందుకు మీడియా ప్రయత్నిస్తుండటం చాలా బాధాకరం,” అని అవినాష్ రెడ్డి అన్నారు.

నిన్న అవినాష్ రెడ్డి విచారణ మొదలయ్యే ముందు వైసీపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో ప్రెస్‌మీట్‌ పెట్టి ఇంచుమించు ఇలాగే మాట్లాడారు. అంటే ఆ సలహాదారే అవినాష్ రెడ్డికి ఈవిదంగా మాట్లాడాలని సలహాలు ఇచ్చారనుకోవాలా?ఓ పక్క సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని ప్రశ్నిస్తుంటే, ఆయనకి ఈ హత్యతో సంబందమే లేదని సజ్జల రామకృష్ణారెడ్డి క్లీన్ చిట్ ఇవ్వడం, టిడిపియే వివేకా హత్యకి కుట్రపన్నిందని చెప్పడం కూడా కేసు విచారణని ప్రభావితం చేస్తున్నట్లే కదా?

ఈ కేసుతో అవినాష్ రెడ్డికి సంబందం ఉందా లేదా అనేది సీబీఐ, కోర్టు తేల్చాల్సి ఉంటుంది తప్ప వైసీపీ నేతలు కాదు. కానీ అవినాష్ రెడ్డి నేరం చేయలేదని సజ్జల ప్రెస్‌మీట్‌ పెట్టి ఇంత గట్టిగా వాదిస్తున్నప్పుడు, గత మూడున్నరేళ్ళుగా ఏపీలో ఈ కేసు దర్యాప్తు ఏవిదంగా జరిగిందో, దర్యాప్తు అధికారులపై ఎంత ఒత్తిడి పడిందో అర్దం అవుతోంది. అందుకే వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఈ కేసు విచారణని హైదరాబాద్‌కి మార్పించుకొన్నారు కదా?

ADVERTISEMENT
Latest Stories