వ్యాపార రంగ సంస్థలు తమ వ్యాపార వృద్ధి కోసమో, వాటి విస్తరణ కోసమో, ప్రజల దృష్టిని తమ వైపుకి తిప్పుకోవడానికో సెలబ్రెటీల ద్వారా తమ ఉత్పత్తులను ప్రమోట్ చెయ్యడం ఆనవాయితీగా మారింది.
అయితే వివిధ రంగాలలోని సెలబ్రెటీ పర్సన్స్ ను తీసుకువచ్చి వారితో తమ ఉత్పత్తుల ప్రమోషన్స్ చేయించి వాటిని యాడ్స్ రూపంలో ప్రజల ముందుకు తెస్తారు ఆ వ్యాపార సంస్థలు. దీనితో అటు కార్పొరేట్ సంస్థలకు వారి ఉత్పత్తుల వినియోగం పెరుగుతుంది, ఇటు సెలబ్రెటీలకు భారీ పారితోషకాలు లభిస్తాయి.
కొన్ని నిముషాల పాటు కనిపించే యాడ్స్ లో నటించేందుకు సినీ స్టార్ సెలబ్రెటీలు సైతం ముందు వరుసలో ఉంటున్నారు. ఇందులో టాలీవుడ్ నుంచి ఈ యాడ్స్ లో ఎక్కువగా కనిపించే స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబే అనేది వాస్తవం. సంతూర్ సోప్ నుంచి రిలయన్స్ ట్రెండ్, డాలర్ బిగ్ బాస్, మౌంటెన్ డ్యూ, అబి బస్, లోయ్డ్ ఏసీ ఇలా ఎన్నో వాణిజ్య ప్రకటనలలో మహేష్ నటిస్తున్నారు.
అలాగే కొన్ని రకాల రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా బ్రాండ్ అంబాజిడర్ గా చేస్తున్నారు ప్రిన్స్. అయితే సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్లు యాడ్స్ లో నటించిన మహేష్ బాబుకి ఈడీ విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఈ సంస్థ ఒకే భూమి ని వివిధ వ్యక్తులకు అమ్మి మోసాలకు పాల్పడుతుంది అని ఈ సంస్థ పై ఈడీ నిర్వహించిన సోదాలలో తేలింది.
ఈ నేపథ్యంలో ఈ సంస్థకు ఎండార్స్ చేసినందుకు గాను సూపర్ స్టార్ మహేష్ 3.4 కోట్ల పారితోషకం తీసుకున్నట్టు గుర్తించిన ఈడీ మహేష్ కు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు సామాన్య ప్రజానీకాన్ని తనకున్న స్టార్ ఇమేజ్, ఛరిష్మాతో మహేష్ ఇన్ఫ్లుయన్స్ చేసారంటూ ఆయన పై అభియోగాలు మోపబడ్డాయి.
ఇదే మాదిరి గత రెండు రోజుల ముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గ్లామర్ డాల్ శ్రీలీల మీద కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. వీరిద్దరూ కూడా ప్రముఖ కార్పొరేట్ విద్యా సంస్థలకు గాను బ్రాండ్ అంబాజిడర్ లుగా వ్యవహరిస్తున్నారు.
వారు ప్రమోషన్స్ లో చెప్పే మాయమాటలను నమ్మి అనేకమంది అమాయకులు తమ అమూల్యమైన జీవితాలను కోల్పోతున్నారు అంటూ AISF విద్యార్థి సంఘాల నాయకులు అల్లు అర్జున్, మీద క్రిమినల్ కేసులు నమోదు చేసారు.
ఒక సెలెబ్రెటీ ఒక సంస్థకు సంబంధించిన యాడ్స్ లో కనిపిస్తున్నారు అంటే సదరు సెలబ్రెటీ ఆ సంస్థ యొక్క అన్ని విషయాల మీద పూర్తిగా అవగాహన చేసుకుని, అందులో ఉన్న మంచి చెడులను బేరీజు వేసుకుని సమాజం పట్ల బాధ్యతగా మెలగాల్సి ఉంటుంది.
లేకుంటే మొన్న ఆన్ లైన్ బెట్టింగ్ ఆప్స్ ను ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లు, యు ట్యూబ్ సెలబ్రెటీలు, బుల్లి తెర నటులు ఎలా అయితే అధికారుల నుంచి నోటీసులు అందుకుని విచారణకు వెళ్తున్నారో ఇప్పుడు అదే మాదిరి ఈ కార్పొరేట్ యాడ్స్ లో నటించినందుకు సదరు స్టార్ సెలబ్రెటీలు సైతం నోటీసులు అందుకుంటున్నారు.
ఈ రకమైన నాణ్యత ప్రమాణాలు పాటించని సంస్థల యాడ్స్ లో నటించినందుకు సెలబ్రెటీలకు భారీ పారితోషకమే కాదు తగిన మూల్యం కూడా చెల్లించాల్సి వస్తుంది అనేది ఈ చర్యలతో స్పష్టమయింది. ఇక పై వాణిజ్య ప్రకటనలలో నటించే సెలబ్రెటీలు తస్మాత్ జాగ్రత్త.




