సోషల్ మీడియాలో ఈరోజు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేరుతో ఓ లేఖ ప్రత్యక్షమైంది. అది చంద్రబాబు నాయుడు తెలంగాణలో కమ్మ సామాజికవర్గానికి చెందిన ప్రజలను ఉద్దేశ్యించి వ్రాయబడింది. అయితే అటువంటి లేఖ ఏదీ వ్రాయలేదని చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు వెంటనే ఖండించారు. చంద్రబాబు నాయుడు, టిడిపి ప్రతిష్టను దిగజార్చేందుకు వైసీపియే ఈ నకిలీ లేఖ సృష్టించి దానిపై ఆయన సంతకం కూడా ఫోర్జరీ చేసి మరీ విడుదల చేసిందని టిడిపి నేతలు ఆరోపించారు.
ఆ లేఖ సారాంశం ఏమిటంటే… “నేను కమ్మ సామాజికవర్గానికి చాలా చేశానని, ప్రస్తుతం టిడిపి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది కనుక మీరందరూ మద్దతు ఈయాలని, తెలంగాణలో ప్రస్తుతం టిడిపి పోటీ చేసే పరిస్థితిలో లేకపోవడం వలన మీరందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కోరిన్నట్లు దానిలో ఉంది.
ఏపీలో వైసీపి మన సామాజికవర్గంపై ‘పెత్తందారులు’ అనే ముద్రవేసి అవమానిస్తోంది. ఓ సీనియర్ రాజకీయనేతగా నాకు జరిగిన అవమానం జీర్ణించుకోలేనిది. ఒకవేళ నేను మళ్ళీ జైలుకి వెళ్ళినా మీ పోరాటాలు ఆపవద్దు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు మీరందరూ తోడ్పడాలని,” చంద్రబాబు నాయుడు వేడుకొంటున్నట్లు దానిలో ఉంది.
తెలంగాణ ఎన్నికల బరిలో నుంచి టిడీపీ ఏ కారణం చేత తప్పుకొన్నప్పటికీ ఏ పార్టీకి బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. కనుక చంద్రబాబు నాయుడు పనిగట్టుకొని కమ్మ సామాజికవర్గానికో మరొకరికో లేఖ వ్రాస్తారనుకోవడం అవివేకమే.
అయితే బీజేపీ అధిష్టానం పురందేశ్వరి, పవన్ కళ్యాణ్‌ల ఒత్తిడికి తలొగ్గి ఎక్కడ టిడిపితో పొత్తులకు సిద్దపడుతుందో అని తీవ్ర ఆందోళన చెందుతున్న వైసీపి, బహుశః బీజేపీని రెచ్చగొట్టేందుకే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని నమ్మించేందుకు ఈ నకిలీ లేఖ సృష్టించి అడ్డంగా టిడిపికి దొరికిపోయింది.
వైసీపీలో అభద్రతాభావం నానాటికీ పెరిగిపోతోందని, అందుకే ఇటువంటి నకిలీ లేఖలు సృష్టించి, చంద్రబాబు నాయుడు సంతకాలు ఫోర్జరీ చేసే స్థాయికి దిగజారిపోయిందని, ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజారపు అచ్చన్నాయుడు అన్నారు.




