టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈనాడు మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వూలో వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం, ఆలోచనా ధోరణి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
“ఎవరైనా కోర్టు కేసులంటే భయపడతారు. కానీ జగన్మోహన్ రెడ్డికి అటువంటి భయాలు ఏమీ లేవు. ఉండి ఉంటే ఇంత బరి తెగించేవాడే కాదు. ఆ మొండి ధైర్యంతోనే జగన్ రాష్ట్రంలో వ్యవస్థలన్నిటినీ చిన్నా భిన్నం చేశాడు. రాష్ట్రాన్ని దోచుకున్నాడు… వైసీపి నేతలు కూడా ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని దోచేసుకుంటుంటే పట్టించుకోలేదు,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.
“ఈ మొండి ధైర్యంతోనే చివరికి తెలుగు భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలను జగన్ విధ్వంసం చేశాడు. ఆలయాలను వైసీపి మూకల చేతికి అప్పగించి వాటి పవిత్రతను దెబ్బ తీస్తున్నాడు. జగన్ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు చేసిన నష్టం, దాని ప్రభావం కళ్ళకు కనిపిస్తుంది. కానీ ఈ సాంస్కృతిక విధ్వంసం కొంత వరకే కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు భాషను దెబ్బ తీయడం ద్వారా జరిగే విధ్వంసం కంటికి కనిపించదు. కానీ దాని దుష్ప్రభావం సమాజంపై చాలా తీవ్రంగా పడుతుంది,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.
తెలుగు భాష, సంస్కృతి, తెలుగువారి ఆచార వ్యవహారాలు, ఆలయాల విధ్వంసం గురించి చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతీ మాట తెలుగు ప్రజలందరి మనసులో మాటలే అని చెప్పవచ్చు. జగన్ ప్రభుత్వం ఇంత భాషా, సాంస్కృతిక విధ్వంసానికి పాల్పడుతున్నా ఎవరూ ఏమీ చేయలేని నిసహాయ పరిస్థితి నెలకొని ఉంది. దీనిని కూడా తాను సవరిస్తానని చంద్రబాబు నాయుడు చెప్పడం రాష్ట్ర ప్రజలకు చాలా సంతోషం కలిగించే విషయమే.
కోర్టు కేసులంటే జగన్‌కు భయం లేదనే చంద్రబాబు నాయుడు మాట కూడా నూటికి నూరు శాతం వాస్తవమే అని అందరికీ తెలుసు. జగన్‌కు ఆ భయమే ఉండి ఉంటే అవినాష్ రెడ్డిని ఇంతగా వెనకేసుకు వచ్చేవారేకారు. ‘మూడు రాజధానులు’ వంటి వికృతమైన ఆలోచన చేసి ఉండేవారే కారని చెప్పవచ్చు.
అయితే జగన్ 5 ఏళ్ళుగా రాష్ట్రాన్ని ఇంతగా విధ్వంసం చేస్తుంటే, మోడీ, అమిత్ షాలు ఎందుకు పట్టన్నట్లు ఊరుకున్నారు?ఎందుకు ఆయనకు సహకరించారు?ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారు? అనే ఆంధ్రా ప్రజల ప్రశ్నకు జవాబు లభించడం లేదు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ఓ ముఖ్య విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ఓటు హక్కు కలిగిన ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మే 13న పోలింగ్ కేంద్రాలకు వచ్చి విజ్ఞతతో ఆలోచించి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదేదో యధాలాపంగా చేసిన విజ్ఞప్తి కానే కాదు. ఎందువల్ల అంటే, ఐటి తదితర కొన్ని రంగాల ఉద్యోగులకు శని, ఆదివారం రెండు రోజులు వారాంతపు సెలవులు ఉంటాయి. ఈసారి పోలింగ్ మే 13 (సోమవారం) జరుగుతుంది. కనుక మూడు రోజులు వరుస సెలవులు కలిసి వస్తున్నాయని కుటుంబాలతో సహా విహార యాత్రలకు బయలుదేరిపోవచ్చు. లేదా వేసవి ఎండలకు భయపడి ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండా మూడు రోజులూ రిలాక్స్ అవ్వాలని అనుకొనేవారు కోకొల్లలు ఉన్నారు.
అటువంటి వారందరూ బద్దకించకుండా వచ్చి ఓట్లు వేస్తేనే ‘వైసీపి సంక్షేమ ఓట్లని’ అధిగమించే అవకాశం ఉంటుంది. కాదని ఇప్పుడు ఓట్లు వేయకుండా ఆనక సోషల్ మీడియాలో మొసలి కన్నీళ్ళు కార్చే మేధావులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం లేదు. అటువంటివారు అక్షర జ్ఞానం లేని నిరక్షరాస్యుల కంటే తక్కువే.
కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఓటు హక్కు కలిగిన ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా వచ్చి ఓట్లు వేయాలి. అప్పుడే వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాజకీయాల గురించి మాట్లాడే నైతిక హక్కు లభిస్తుంది.






