ఇద్దరి ప్రయత్నాలలో తేడా ఇదే!

Chandrababu Naidu and Jagan Mohan Reddy over AP development and capital politics

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు అధికార, అభివృద్ది వికేంద్రీకరణ కొరకు మూడు రాజధానుల ప్రతిపాదన చేసింది. అయితే దాని అసలు ఉద్దేశ్యం వేరే. అమరావతి రాజధాని అంటున్న టీడీపి, జనసేనలు ఈ ప్రతిపాదనని ఎలాగూ వ్యతిరేకిస్తాయి.

ఈ మూడు ప్రాంతాలను రాజధానులుగా అభివృద్ధి చేద్దామనుకుంటే అవి వ్యతిరేకిస్తున్నాయంటూ ప్రజలను రెచ్చగొట్టి రాష్ట్రంలో ఎక్కడా వాటికి చోటు లేకుండా చేయాలనే ఉద్దేశ్యం కనిపిస్తోంది.

ADVERTISEMENT

మూడు రాజధానులు ప్రతిపాదన చేసిందే వైసీపీ కాగా, వాటి కోసం అటు రాయలసీమలో, ఇటు ఉత్తరాంధ్రలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల చేత సభలు, ర్యాలీలు నిర్వహింపజేయడమే ఇందుకు నిదర్శనం.

కానీ ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో వ్యూహం మార్చి ఈసారి విశాఖ రాజధాని అంటూ కొత్త పల్లవి అందుకుంది.

ఈ ప్రతిపాదనతో టీడీపికి కీలకమైన ఉత్తరాంధ్రపై పట్టు సాధించి దెబ్బ కొట్టాలనుకుంది. కానీ ఈ ప్రతిపాదనలో వైసీపీకి చిత్తశుద్ధి లేదని ప్రజలు గ్రహించడంతో ఇదీ బెడిసి కొట్టింది. చివరికి ఈ మూడు రాజధానులు, విశాఖ రాజధాని ప్రతిపాదనల వల్లనే వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది.

రాజధాని పేరుతో వైసీపీ రాజకీయాలు చేస్తే, సిఎం చంద్రబాబు నాయుడు మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తూ, తాగు సాగు నీటిని అందిస్తూ ప్రజల మనసులు, ముఖ్యంగా… గ్రామీణ ప్రజల మనసులు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

వెలిగొండ ద్వారా కడప, మార్కాపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగుసాగు నీరు అందుతుంది. అలాగే పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాలకు తాగుసాగు నీరు అందుతుంది.

గ్రామాలలో రైతులకు సాగునీరు అందిస్తే వారు చాలా సంతోషిస్తారని వేరే చెప్పక్కరలేదు. అలాగే దశాబ్దాలుగా ఫ్లోరైడ్ సమస్యతో బాధలు పడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రజలు కృష్ణమ్మ నీళ్ళతో సంతోషపడతారు.

కనుక అటు చిత్తూరు, నెల్లూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు కూటమి ప్రభుత్వం నీరు పారించగలిగితే, వచ్చే ఎన్నికలలో ఓట్లు పడతాయని వేరే చెప్పక్కరలేదు. ఇదే విధంగా పరిశ్రమలు, ఐటి కంపెనీలతో ఉద్యోగాలు కల్పిస్తుంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి.

ప్రజలు తమ జీవితాలలో ఈ మార్పుని తప్పక గుర్తిస్తారు. కనుక అందుకు కారణమైన కూటమి ప్రభుత్వానికి మళ్ళీ అధికారం కట్టబెట్టాలనుకోవడం సహజం.

ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పనులను వ్యతిరేకిస్తూ, పరిశ్రమలు, ఐటి కంపెనీలను రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ, అమరావతిని కాదని మావిగన్‌ అంటున్నందుకు, వైసీపీ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగేలా చేసుకుంటున్నారు. కనుక జగన్‌ ధోరణి కూడా వచ్చే ఎన్నికలలో కూటమికి కలిసి రావచ్చు.

చివరిగా ఒక మాట. నాడు జగన్‌, నేడు చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా ప్రజలను మెప్పించి ఓట్లు సంపాదించుకోవాలని కోరుకున్నారు.

అయితే అందుకు జగన్‌ ఎంచుకున్న విధానంలోనే లోపం ఉంది. పైగా చిత్తశుద్ధి కూడా లేదు. కానీ చంద్రబాబు నాయుడు ప్రజలకు ఉపయోగపడే పనులను చిత్తశుద్ధితో చేస్తున్నారు. వాటితో వారి జీవితాలు మెరుగయితే ఆ మార్పుని ప్రజలు గుర్తించి అందుకు కారణమైన సిఎం చంద్రబాబు నాయుడుకు మొగ్గు చూపడం సహజం.. కదా?

ADVERTISEMENT
Latest Stories