మంత్రి కొండా సురేఖ భయపడినట్లే జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఈరోజు ఉదయం ఆమెకు ఫోన్ వచ్చింది. ఈరోజు సాయంత్రం సిఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ వచ్చేలోగా రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. లేకుంటే మంత్రివర్గం నుంచి తొలగించినట్లు గవర్నర్‌కు లేఖ వెళ్తుందని హెచ్చరించింది. పరిస్థితి అంతవరకు తెచ్చుకోవద్దని కాంగ్రెస్ అధిష్టానం హితవు పలికింది.
తనపై వేటు పడటం ఖాయమని మంత్రి కొండా సురేఖ నిన్న ఢిల్లీలో ఉన్నప్పుడే గ్రహించారు. కనుక హైదరాబాద్ తిరిగి రాగానే తన భర్త, అనుచరులతో సమావేశమై చర్చించారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు మీడియా సమావేశం నిర్వహించి తమ నిర్ణయం చెప్పాలనుకున్నారు.
కానీ ఈలోగానే కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఈ హెచ్చరిక వచ్చింది. కనుక ఒకవేళ కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలనుకుంటే తక్షణం రాజీనామా చేయాక తప్పదు.
ఒకవేళ పార్టీ వీడాలనుకుంటే రాజీనామా చేయకుండా బర్త్ రఫ్ చేయించుకుంటే, తనపై కుట్రలు చేసి అన్యాయంగా పదవిలోనుంచి తొలగించారని చెప్పుకొని నియోజకవర్గంలో ప్రజల సానుభూతి పొందవచ్చని భావిస్తే రాజీనామా చేయకపోవచ్చు.
ఏది ఏమైనప్కాపటికీ, కొండా సురేఖ కథ క్లైమాక్స్‌కి వచ్చేసిందని స్పష్టమవుతోంది. కనుక మిగిలిన ఈ మూడు నాలుగు గంటలలో కొండా దంపతులు క్లైమాక్స్‌లో ఏమైనా కొత్త ట్విస్ట్ ఇస్తారా? రాజీనామా చేసి శుభం కార్డు వేస్తారా? చూడాలి.
కానీ ఒక్క విషయం. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మూడేళ్ళుగా అరిచి గీపెడుతున్నా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. కానీ కొండా సురేఖకి ఆ ఆదృష్టం దక్కింది.
దానితో సంతృప్తి పడకుండా అత్యాశ పోయినందుకు చేజేతులా మంత్రి పదవి ఊడగొట్టుకొంటున్నారని చెప్పక తప్పదు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది అంటే ఇదేనేమో?




