తెలంగాణాలో ఎన్నికల హడావిడి పూర్తి అయిపోయాయి. కాంగ్రెస్ తో ఏళ్ల తరబడి ఉన్న వైరాన్ని పక్కన పెట్టి చంద్రబాబు కేసీఆర్ ని ఓడించడమే లక్ష్యంగా ఈ ఎన్నికలలో సర్వశక్తులు ఒడ్డారు. అయితే మహాకూటమికి అత్యంత దారుణమైన ఫలితం ఎదురయ్యింది. ప్రచారం సందర్భంగానే చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న పనికి ఇంతకింతా అనుభవిస్తారని తెరాస వారు వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ అయితే మేము ఆంధ్ర రాజకీయంలో వేలు పెట్టాల్సి వస్తుంది అని డైరెక్టుగానే అనేశారు.
[m9ad]
తెరాసకు ఆంధ్రలో డైరెక్టుగా ఎంటర్ అయ్యే వీలు లేకపోయినా ఆ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్ష పార్టీలకు మద్దతు ఇచ్చే అవకాశం బాగా ఉంది. వారికి అర్థ బలం అందిస్తే అది తెలుగుదేశం పార్టీకి చాలా ఇబ్బందిగా పరిణమిస్తుంది. ఇప్పటికే ఉన్న శత్రువులు చాలన్నట్టు ఇప్పుడు కొత్తగా కేసీఆర్ తోడయ్యారు. పైగా ఈ శత్రువుకు ఒక సంపన్న రాష్ట్ర ఖజానా కూడా అండగా ఉంటుంది. ఈ క్రమంలో చంద్రబాబుకు కష్టాలు తప్పవు అనే చెప్పాలి. చంద్రబాబు తెలంగాణాలో పోటీ చెయ్యాలి అనుకున్నప్పుడే ఈ విషయం అలోచించి ఉండాలి.
దాదాపుగా నాలుగున్నర ఏళ్ళ పాటు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోషించవలసిన ఏ పాత్రను సరిగ్గా చెయ్యని కాంగ్రెస్ ను నమ్ముకుని ఇంత రిస్క్ ఎందుకు తీసుకున్నారో ఆయనకే తెలియాలి. మరోవైపు జాతీయ స్థాయిలో చంద్రబాబుకు ఉన్న పరపతిని దెబ్బ తీయడానికి ఇప్పటి నుండి కేసీఆర్ కృష్టి చేస్తారు. గతంలో ఆపేసిన ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ఆయన ఇప్పుడు ముమ్మరం చేస్తారు. ఎలాగూ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇప్పటినుండి పూర్తి సమయం దానికే కేటాయిస్తారు.
మరోవైపు చంద్రబాబుకేమో రాష్ట్రంలో ఎన్నికల మీద దృష్టి పెట్టాలి. ఈ క్రమంలో జాతీయ నాయకులు ఎటువైపు చూస్తారో కూడా చూడాలి. కేసీఆర్ చేతిలో చిత్తైన చంద్రబాబును నమ్మగలమా అని వారు ఆలోచించినా అందులో ఆశ్చర్యమేమీ లేదు. అసలు ఈ ఎన్నికల ఓటమి తరువాత కాంగ్రెస్ ఓటమి నెపాన్ని చంద్రబాబు మీదకు తోసేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఈ క్రమంలో వచ్చే ఆరు నెలలు చంద్రబాబుకు సవాల్ అనే చెప్పుకోవాలి. మరి ఈ కష్టాల పద్మవ్యూహం నుండి ఆయన ఎలా బయటపడతారో చూడాలి.



