ఏపీకి ‘ప్రత్యేక హోదా’ కోసం కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రతిపాదించిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రసంగం… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఆగ్రహావేశాలకు గురి చేసిన విషయం తెలిసిందే. అయితే నాడు తన క్యాంపు కార్యాలయంలో కూర్చుని పనులన్నీ పక్కనబెట్టి జైట్లీ ప్రసంగం వింటున్న చంద్రబాబు ఏ విధంగా స్పందించారన్న విషయం తాజాగా వెలుగు చూసింది.
అప్పటివరకు సమీక్షలతో బిజీబిజీగా ఉన్న సీఎం జైట్లీ ప్రసంగానికి కాస్తంత ముందుగా అందరినీ బయటకు పంపేసి టీవీని చూడటం ప్రారంభించారు. ఆ సమయంలో ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, కింజరాపు అచ్చెన్నాయుడు మాత్రమే ముఖ్యమంత్రి వద్ద ఉన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై సభలోని ఇతర నేతలు ప్రసంగించిన తర్వాత, ఎట్టి పరిస్థితుల్లోనూ హోదా ఇవ్వలేమని జైట్లీ తేల్చి చెప్పగానే చంద్రబాబు స్పందన చాలా తీవ్రంగా ఉందని, తాజాగా మీడియా వర్గాలలో కధనాలు ప్రసారం అవుతున్నాయి.
చేతిలోని పేపర్లను టేబుల్ పైకి గిరాటేసి, ఇంత దారుణమా? అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. కేంద్ర కేబినెట్ నుంచి బయటకు వచ్చేద్దాం. సీఎంఓ ముఖ్య కార్యదర్శి సతీశ్ చంద్రను ఎక్కడున్నారు? ఎక్కడున్నా పిలవండి. లెటర్ ప్రిపేర్ చేయమనండి అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీంతో షాక్ తిన్న అచ్చెన్నాయుడు, శాంతింప చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక తప్పదనుకున్న యనమల కల్పించుకుని, మరింత సర్దిచెప్పే విధంగా మాట్లాడంతో పాటు, తదుపరి పరిణామాలను వివరించడంతో చంద్రబాబు కాస్తంత శాంతించారట. ప్రస్తుతం ఈ సమాచారం పొలిటికల్ వర్గాల్లో హాట్ హాట్ గా హల్చల్ చేస్తోంది.



