ఒకే దెబ్బకు బాబు నాలుగు పిట్టలు

Chandrababu-Naidu-TDP-Congress-Allianceమూడేళ్ళ క్రితం తెలంగాణ ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నారని, దానిని సకాలంలో గుర్తించి అడ్డుకొని తన ప్రభుత్వాన్ని కాపాడుకొన్నానని సిఎం కేసీఆర్‌ చెప్పడం అందరికీ తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే మాట చెపుతుండటం విశేషం. బిజెపి-వైకాపా-జనసేన-తెరాస నాలుగు పార్టీలు కలిసి తన ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి కుట్రలు పన్నుతున్నాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఆయన చేస్తున్న ఆరోపణలు నిజమనుకొంటే ఆయన కూడా కేసీఆర్‌ లాగే తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించక తప్పదు.

[m9ad]

ADVERTISEMENT

బహుశః ఆ ప్రయత్నాలలో భాగంగానే ఆయన తమ పార్టీకి బద్ధశత్రువైన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారనుకోవచ్చు. తద్వారా ఏపీలో తనకు పక్కలో బల్లెంగా మారిన జగన్మోహన్ రెడ్డిని, బిజెపిలను నిలువరించేందుకు ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ మద్దతు పొందగలుగుతారు. ఒకవేళ ఏపీలో కాంగ్రెస్ పార్టీని టిడిపివైపు తిప్పుకోలేకపోయినా కనీసం అది జగన్మోహన్ రెడ్డితో చేతులు కలపకుండా నివారించగలిగారని చెప్పవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం ద్వారా నానాటికీ అస్థిత్వం కోల్పోతున్న టిటిడిపిని కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు.

ఇక బిజెపిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ పార్టీనే అస్త్రంగా మార్చుకోవడం చంద్రబాబు నాయుడు రాజకీయ చతురతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కేంద్రంలో అధికారంలోకి రావాలని ఆరాటపడుతున్న కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి దేశంలో బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలను అన్నిటినీ కాంగ్రెస్‌ నేతృత్వంలో పనిచేసేందుకు ఆయన ఒప్పిస్తున్నారు. ఆ ప్రయత్నాలలో ఆయన సఫలం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి కూడా.

చంద్రబాబు నాయుడు ఈ వ్యూహంతో ఒకే దెబ్బకు నాలుగు పిట్టలు కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు.

1. రాష్ట్రంలో వైకాపా, బిజెపి, జనసేనల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడం.

2. తెలంగాణలో టిడిపిని కాపాడుకోవడం.

3. కాంగ్రెస్ పార్టీకి మద్దతు కూడగట్టి కేంద్రంలో అధికారంలోకి రప్పించడం ద్వారా మోడీ నుంచి ముప్పు తప్పించుకోవడం.

4. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగితే ఏపీకి ప్రత్యేకహోదా సాధించడం.

ఇవన్నీ తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలియకనే మహాకూటమిని చంద్రబాబు నాయుడుతో ముడిపెట్టి విమర్శలు చేస్తున్నారనుకోలేము. తెరాసకు గట్టి సవాలు విసురుతున్న మహాకూటమిని అడ్డుకోవాలంటే, ప్రజలకు చంద్రబాబు నాయుడును బూచిగా చూపించి వారిలో సెంటిమెంటును రగిలించకతప్పదు. ఎన్నికల సమయంలో ప్రజలలో సెంటిమెంటు రగిలించడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ‘చంద్రబాబు నాయుడు బూచి-వ్యూహాన్ని’ అమలుచేస్తున్నారని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories