పెద్దాయన మారారు.. యువనేత మాత్రం మారరా?

chandrababu-naidu-vs-jagan-mohan-reddy-real-change

సినిమాలలో కొన్ని కథలు, ఫార్ములాలు, కాంబినేషన్‌లు సక్సస్ కావచ్చు. కానీ కొత్త ఆలోచనలు, ప్రయోగాలు చేయకుండా వాటినే పట్టుకొని వ్రేలాడుతుంటే నిరాశలు, ఎదురుదెబ్బలు తప్పవు. రాజకీయాలతో సహా అన్ని రంగాలకు ఇదే వర్తిస్తుంది.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దశాబ్దాలపాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌ పార్టీ ఈ కారణంగానే అధికారం కోల్పోయింది. సరికొత్త ఆలోచనలు, సామాన్య ప్రజలలో నుంచి నాయకులను ఎంపిక చేసుకొని వచ్చిన ఆమాద్మీ పార్టీకి ప్రజాధరణ, అధికారం లభించింది. కాక్రోచ్ జనతా పార్టీ అంటూ విలక్షణమైన ఆలోచన, యువతకు దేశవ్యాప్తంగా ఆదరణ లభించింది.

ADVERTISEMENT

ఈ నేపధ్యంలో చూస్తే సిఎం చంద్రబాబు నాయుడులో చాలా మార్పు కనిపిస్తోంది. కానీ మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డిలో మార్పు ఇంకా విధ్వంసకరంగా మారిందనిపిస్తుంది.

చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కేవలం కంప్యూటర్లు, అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచిస్తారనే అభిప్రాయాన్ని తుడిచిపెట్టేస్తూ, ఈసారి సంక్షేమ పధకాలకు, ప్రజా సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తుండటం చక్కటి మార్పే.

సిఎం చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజల మద్యకు వెళుతూ వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇది చాలా మంచి ఆలోచనే. కానీ ఆ ప్రజలు ‘ఎంపిక చేసిన భజన బృందాలు’ కాకూడదు.

అలాగే ప్రజలతో మమేకం అవడం ఎంత ముఖ్యమో, హంగు ఆర్భాటాలకు, ప్రచార యావకు దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. అప్పుడే ప్రజలు వారి నిజాయితీని గుర్తిస్తారు.

ఈ వయసులో చంద్రబాబు నాయుడే ఇంతగా మారగలిగినప్పుడు, యువనేత జగన్మోహన్ రెడ్డి మారలేరా? అంటే తప్పకుండా మారగలరు.. కానీ అది మరింత విధ్వంసకరంగానే తప్ప నిర్మాణాత్మకంగా కాదని ఆయనే స్వయంగా నిరూపించుకుంటున్నారు.

ఈ వయసులో, ఈ హోదాలో చంద్రబాబు నాయుడు నిత్యం ప్రజల మద్యన ఉంటూ, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ అభివృద్ధి పనులు చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి ప్యాలస్‌లోనే ఉంటూ ప్రజలను, పార్టీ నేతలను అక్కడికే రప్పించుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు.

బహుశః ఇప్పటి నుంచే ప్రజల మద్య తిరగడం వృధా శ్రమ, వృధా ఖర్చుగా భావిస్తున్నారేమో? ఈ లెక్కన వైసీపీ నేతలు, కార్యకర్తలను కూడా ఇంట్లోనే కూర్చోనీయాలి కదా?

కానీ వారిని నిత్యం రోడ్లపై ఉంటూ తన శక్తిని చాటాలని జగన్‌ కోరుకుంటున్నారు! ఆ ప్రయత్నంలో వారు కేసులలో చిక్కుకొని జైళ్ళకు వెళ్ళాల్సివస్తోంది. అప్పుడు వారిని పరామర్శించే పేరుతో బయలుదేరి, దారిలో బలప్రదర్శనలు చేస్తున్నారు.

కానీ వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే, నాడు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏవిధంగా మారారో అదేవిధంగా మారాల్సి ఉంటుంది. తండ్రి కొడుకుల డీఎన్ఏ ఒకటే అయినప్పటికీ రప్పారప్పాలు, మావిగన్‌లు చూస్తుంటే జగన్‌లో అలాంటి మార్పు అసాధ్యమనిపిస్తోంది.

కానీ ప్రజలు ఎప్పుడూ మార్పు కోరుకుంటారు కనుక ఈసారి మళ్ళీ తనకి అధికారం కట్టబెడతారని జగన్మోహన్ రెడ్డి గట్టి నమ్మకంతో ఉన్నట్లున్నారు. మంచిదే. ఎవరి నమ్మకాలు వారివి.

ADVERTISEMENT
Latest Stories