
ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని ప్రజలు భావిస్తారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్ళిన ప్రతీసారి ఇదే స్టోరీ చెప్పేవారు. వారి సొంత మీడియా కూడా ఇదే స్టోరీ చెపుతుండేది.
కానీ వాస్తవానికి సంక్షేమ పధకాలకు అప్పుల కోసం, తమ కేసులలో ఉపశమనం కోసమే వచ్చి కలుస్తుండేవారని అందరికీ తెలుసు.
జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత రాష్ట్రానికి ఏదో రూపంలో ఓ అప్పు మంజూరు అవుతుండేది. ఒకవేళ ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ లభించకపోతే జగన్ సెల్లారులో తన కారులోనే కూర్చొని కాలక్షేపం చేసి వచ్చేసేవారని ఓ సీనియర్ బీజేపి నేత ఇదివరకే చెప్పారు.
జగన్ ఢిల్లీ పర్యటనలు ఈవిదంగా సాగితే సిఎం చంద్రబాబు నాయుడు తాజా ఢిల్లీ పర్యటన ఇందుకు భిన్నంగా సాగుతోంది. సోమవారం ఢిల్లీలో 16వ ఆర్ధిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగాడియాతో సమావేశమయ్యి రాష్ట్రాభివృద్ధి కోసం అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు.
Also Read – జగన్ 2.0: ఏపీకి, చంద్రబాబుకి మరింత కష్టమే!
రాష్ట్ర ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్, ఆర్ధిక తదితర శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర విభజన, ఆ తర్వాత జగన్ ఆర్ధిక విధ్వంసంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏయే రంగాలలో ఎంతగా నష్టపోయిందో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వారు అరవింద్ పనగాడియాకు వివరించారు.
సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో అమరావతి, పోలవరం, పోర్టులు, భోగాపురం విమానాశ్రయం, రోడ్లు, ఫ్లై ఓవర్ నిర్మాణాలు తదితర అభివృద్ధి పనుల గురించి వారికి వివరించి రాష్ట్రాభివృద్ధికి ఉదారంగా సహాయసహకారాలు అందించాలని సిఎం చంద్రబాబు నాయుడు ఆర్ధిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగాడియాకు విజ్ఞప్తి చేశారు.
Also Read – విశాఖ రైల్వే జోన్‌కి ఇన్ని తిప్పలా?
దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రంపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. కనుక సిఎం చంద్రబాబు నాయుడు అడిగినంత మాత్రాన్న ఉదారంగా నిధులు మంజూరు చేసేస్తుందని అనుకోవడం అత్యాశే. కానీ అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదన్నట్లు అడగందే కేంద్రం కూడా నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేసేయదు.
కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ తదితరులు తమ వంతు ప్రయత్నం చేశారు.
కానీ 5 ఏళ్ళలో అనేకసార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చిన జగన్ ఏనాడూ ఈవిదంగా ఆర్ధిక సంఘం ఛైర్మన్, అధికారులతో సమావేశం అయిన దాఖలాలు లేవు. ఎందువల్ల అంటే ఆయన ప్రాధాన్యత రాష్ట్రాభివృద్ధి కాదు కనుక. రాష్ట్రాభివృద్ధికి ఏమేమి చేయాలో అవగాహన, ఆసక్తి లేదు గనుక. ఇదే చంద్రబాబు నాయుడుకి, జగన్మోహన్ రెడ్డికి తేడా!