మొన్న తెలంగాణలో, నేడు ఆంధ్రాలో… ఫైల్స్ మాయం?

ap-cid-officers-burnts-documents

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోతున్న సూచనలు కనపడగానే కొందరు మంత్రులు, వారి అక్రమాలకు సహకరించిన కొందరు ఉన్నతాధికారులు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ముఖ్యమైన ఫైల్స్ మాయం చేశారు. హైదరాబాద్‌లోగల పర్యాటక శాఖ కార్యాలయంలో అర్దరాత్రి మంటలు చెలరేగి కీలకమైన ఫైల్స్, ఆ సమాచారం కలిగిన కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. మసాబ్ టాంక్ వద్ద గల మరో కార్యాలయంలో కొందరు వ్యక్తులు జొరబడి రహస్యంగా లోపల ఉన్న ఫైల్స్ అన్నీ మూటలు కట్టి ఎత్తుకుపోయారు. గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అవినీతి, అక్రమాలకు పాల్పడినందునే వాటికి సంబందించిన సాక్ష్యాధారాలు లభించకుండా ఫైల్స్ మాయం చేయించిందని ముఖ్యమంత్రిగా బాధ్యలు చేపట్టిన రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

ADVERTISEMENT

మొన్న తెలంగాణలో జరిగిన్నట్లే ఇప్పుడు ఆంధ్రాలో కూడా జరుగబోతోందని, అలా జరుగకుండా అడ్డుకోవాలని కోరుతూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర గవర్నర్‌ను కోరుతూ లేఖ వ్రాశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారుతున్న ఈ సమయంలో ఇంతకాలం ప్రభుత్వ శాఖలు వినియోగించిన ‘ఈ-ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌’ని ఈ నెల 17 నుంచి 27వరకు నిలిపివేస్తుండటం, దానిని అప్‌గ్రేడ్ చేస్తుండటంపై చంద్రబాబు నాయుడు అనుమానం వ్యక్తం చేశారు.

జగన్‌ ప్రభుత్వం అనేక అవినీతి, అక్రమాలకు, అడ్డుగోలు పంపకాలు, నిర్ణయాలు తీసుకుందని కనుక వాటికి సమబందించిన సాక్ష్యాధారాలు లభించకుండా నాశనం చేసేందుకే ఈ సమయంలో ఈ-ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌’ని నిలిపివేసి, అప్‌గ్రేడ్ చేస్తోందని, కనుక అలా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని చంద్రబాబు నాయుడు గవర్నర్‌ని కోరారు.

అలాగే అమరావతిలో సచివాయలయంతో సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఫైల్స్ బయటకు తీసుకువెళ్ళకూడదని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని చంద్రబాబు నాయుడు గవర్నర్‌కి విజ్ఞప్తి చేశారు. అన్ని డాక్యుమెంట్స్ హార్డ్ కాపీలు, సాఫ్ట్‌ కాపీలు భద్రపరచాలని సీఎస్ జవహార్ రెడ్డిని ఆదేశించాలని చంద్రబాబు నాయుడు గవర్నర్‌ని కోరారు.

మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని జగన్‌ నిన్న ధీమా వ్యక్తం చేసినప్పటికీ, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే తమపై ప్రతీకారం తీర్చుకుంటుందని జగన్‌తో సహా వైసీపిలో అందరికీ తెలుసు. కనుక తమ అవినీతి, అక్రమాలకు సంబందించి సాక్ష్యాధారాలు సంకీర్ణ ప్రభుత్వం చేతిలో పడకుండా అందరూ ముందే జాగ్రత్త పడతారు.

కొన్ని రోజుల క్రితమే తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలోకి ఓ పోలీస్ కంటెయినర్ ఎటువంటి తనికీలు లేకుండా ప్రవేశించి, కొంతసేపు తర్వాత బయటకు వెళ్ళిపోయింది. దానిపై మీడియా, ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేసినా జగన్‌ ప్రభుత్వం స్పందించలేదు. ఆ పోలీస్ కంటెయినర్ వాహనం ముఖ్యమంత్రి కార్యాలయంలోకి ఎందుకు వచ్చింది? ఏమి తీసుకువెళ్ళింది? ఎక్కడకు తీసుకు వెళ్ళింది?అనే ప్రశ్నలకు ఇంతవరకు సమాధానమే ఇవ్వలేదు.

అంతకు ముందు తాడేపల్లిలోని పాతూరు రోడ్డులో గల సిట్ కార్యాలయంలో సిబ్బంది అనేక కాగితాల కట్టలకు మంట పెట్టి తగులబెట్టారు.

కనుక మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలలో కూడా కీలకమైన పత్రాలు, ఫైల్స్ మాయం చేయవచ్చని చంద్రబాబు నాయుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారనుకోవచ్చు. కానీ రాష్ట్ర గవర్నర్‌ చురుకుగా స్పందించి తగు చర్యలు చేపడితేనే ఇది సాధ్యం. మరి చంద్రబాబు నాయుడు లేఖపై స్పందించి గవర్నర్‌ వెంటనే చర్యలు తీసుకుంటారా?

ADVERTISEMENT
Latest Stories