గత ఏడాది కాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెన్సార్ సమస్యలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. చిన్న సినిమాల విషయంలో ఈ సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయి. కొన్ని సినిమాలు లాస్ట్ మినిట్ లో టైటిల్ మార్చుకోవాల్సి వస్తే.. ఇంకొన్ని సినిమాలు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంలో జరిగిన జాప్యం కారణంగా ఏకంగా రిలీజ్ డేట్ మార్చుకోవాల్సి వచ్చిన సందర్భాలు కూడా చూసాం.
“సరస్వతి, హే బలవంత్” సినిమాల నేపథ్యంలో సెన్సార్ సభ్యులు టైటిల్ మార్చాలని గట్టిగానే డిమాండ్ చేసారు. “సరస్వతి” సినిమాలో టైటిల్ పాత్రధారి మైనర్ గా ఉన్నప్పుడు మానభంగం కాబడుతుంది కాబట్టి, దేవత పేరు కాబట్టి, రిలీజియస్ ఇష్యూస్ ఎందుకులే అని టైటిల్ మార్చమన్నారు అనుకుందాం. “హే బలవంత్” కూడా వేశ్యల లాడ్జ్ కి “భగవాన్” అనే పేరు రిలీజియస్ ఇష్యూస్ అనుకుందాం. ఈ రెండు సినిమాల విషయంలో కనీసం ఒక లాజిక్ ఉంది.
అయితే.. “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాకి “A” సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారో చాలామందికి అర్థం కాలేదు. అదే విధంగా “మోగ్లీ” సినిమాకి పనిగట్టుకుని “A” సర్టిఫికెట్ ఎందుకు అంటగట్టారు అనేది ఇప్పటికీ పెద్ద మిస్టరీ.
ఇలా రీసెంట్ గా సెన్సార్ బోర్డ్ మోనార్కీకి బలైన చిత్రం “దీవానా”. అసలు సినిమాలో ఎలాంటి అసభ్య పదజాలం కానీ, ఇబ్బందిపెట్టే ఎక్స్ పోజింగులు కానీ, కులాన్నో-వర్గాన్నో తక్కువ చేసే సందర్భాలు కానీ ఉండవు. అయినా ఈ సినిమాకి “A” సర్టిఫికెట్ వచ్చింది. అది కూడా ఒకరోజు లేటుగా, దాంతో టీమ్ తమ రిలీజ్ డేట్ ను కూడా మార్చుకోవాల్సి వచ్చింది. ఇవాళ సక్సెస్ మీట్ లో టీమ్ మెంబర్స్ అందరూ సెన్సార్ బోర్డ్ నిర్ణయంపై గట్టిగానే స్పందించారు.
గతంలో సందీప్ రెడ్డి వంగా, రాంగోపాల్ వర్మ వంటి దర్శకులు సెన్సార్ బోర్డులో సీనియర్ ఫిలిం మేకర్స్ కూడా ఉండాలి, లేకపోతే ఇండస్ట్రీకి చేటు అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే.. వాళ్లన్న మాట నిజమే అనిపిస్తోంది. మరి సెన్సార్ బోర్డులో మార్పుకు టాలీవుడ్ పెద్దలు నడుం బిగిస్తారా? లేక తమ సినిమాలకు పెద్ద సమస్య ఏం లేదని లైట్ తీసుకుంటారా అనేది చూడాలి.




