సిఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో నిన్న కాకినాడ జిల్లా ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. అందరూ ప్రజలతో మమేకం అవుతూ ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పధకాల గురించి ప్రజలకు వివరించాలి. అవసరమైనవారికి సాయపడి మంచి పేరు తెచ్చుకోవాలి. అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది,” అని హితవు చెప్పారు.
ఈ వార్త ఇప్పటికే మీడియాలో వచ్చిందిగా? కొత్తగా చెప్పేందుకు ఏముంది? మళ్ళీ దేనికీ సోది? అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తు చేసుకోవాలి.
గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ ప్రజా ప్రతినిధులతో కూర్చొని ఇలా మాట్లాడేవారు కారు. కనీసం అపాయింట్మెంట్ లభించేది కాదు. కోటరీని దాటుకొని జగన్‌ని చేరుకోవడం అసాధ్యంగా ఉండేది.
కానీ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌తో సహా మంత్రులందరూ తమ ప్రజా ప్రతినిధులతో తరచూ భేటీ అవుతుంటారు. వారికి ఇలా హితబోధ చేయడమే కాకుండా వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకుంటారు.
ప్రజా దర్బార్ పేరుతో సామాన్య ప్రజల సమస్యలు కూడా పరిష్కరిస్తుంటారు. సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అయితే నేరుగా గ్రామాలకు, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి స్వయంగా పరిస్థితి తెలుసుకుంటారు. ప్రజలతో, విద్యార్ధులతో కూర్చొని మాట్లాడి, వారితో కలిసి భోజనాలు చేసి సత్సంబంధాలు (పబ్లిక్ రిలేషన్స్) కలిగి ఉంటారు.
అంత ఉన్నత స్థానాలలో ఉన్నవారు తమ వద్దకు వచ్చి మాట్లాడితే ప్రజలకు కూడా వారిపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని ప్రజలకు నమ్మకం కలిగితే మళ్ళీ ఎన్నికలలో గెలిపించి అధికారం కట్టబెడతారు.
కనుక కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీల ప్రజా ప్రతినిధులు కూడా వారిని చూసి ఇదేవిధంగా మెసులుకోవాలి. అందరూ మంచి పేరు తెచ్చుకోవాలి.
సిఎం చంద్రబాబు నాయుడు వారితో మాట్లాడి పంపించేయడం లేదు. అందరూ బాధ్యత తీసుకొని తమతమ నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు జరిపించాలని, వాటికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని భరోసా ఇస్తున్నారు కూడా.
గత ప్రభుత్వ హయంలో జగన్ ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా కథ నడిపించేవారు. తత్ఫలితంగా ప్రజా ప్రతినిధులకు-ప్రజలకు మద్య దూరం పెరిగింది. వారి ప్రాధాన్యత తగ్గింది. అందువల్లే గడప గడపకి వెళ్ళాలని జగన్ ఎన్నిసార్లు సూచించినా ఎవరూ వెళ్ళడానికి ఇష్టపడేవారు కారు.
వాలంటీర్లతో ప్రభుత్వం నడిపితే ఎంత నష్టమో చాలా ఆలస్యంగా గ్రహించారు. ఎన్నికల ముందు వారి చేత బలవంతంగా రాజీనామాలు చేయించి ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. కానీ అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. వైసీపీ ఓడిపోయింది. వాలంటీర్లు కూడా రోడ్డున పడ్డారు.
కానీ సిఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రజా ప్రతినిధులకే ప్రాధాన్యం ఇస్తూ, వారిని ఈవిధంగా ప్రోత్సహిస్తూ, వారి ద్వారానే అభివృద్ధి, సంక్షేమ పధకాలు అమలుచేయిస్తూ అందరూ మంచిపేరు తెచ్చుకోవాలని కోరుతున్నారు!
ఈ అవకాశాన్ని గుర్తించి సద్వినియోగం చేసుకొని మీరూ మంచి పేరు తెచ్చుకోండి. ప్రభుత్వానికీ మంచి పేరు తెండి. రాష్ట్రానికి, ప్రజలకు మేలు చేయండని సిఎం చంద్రబాబు నాయుడు చెపుతున్నారు.
మరోపక్క జగన్మోహన్ రెడ్డి తన నేతలను, కార్యకర్తలను రప్పారప్పా, మావిగన్ అంటూ తప్పుడు మార్గంలో నడిపిస్తూ అందరూ నష్టపోయేలా చేస్తున్నారు. సిఎం చంద్రబాబు నాయుడుకి, జగన్మోహన్ రెడ్డికి తేడా ఇదే.
రాజకీయాలలో సిఎం చంద్రబాబు నాయుడు వంటి మార్గదర్శి లభించడం కూటమి నేతల, ప్రజా ప్రతినిధుల అదృష్టం. ఆయన చెప్పాల్సింది చెప్పారు. కనుక ఇప్పుడు బంతి వారి కోర్టులోనే ఉంది.




