రోడ్లు ప్రజల మృత్యు శకటాలుగా మారుతున్న దృశ్యాలు రెండు తెలుగు రాష్ట్రాలను కలవపరుస్తున్నాయి. మొన్న ఏపీలోని కర్నూల్ బస్సు ఘటన మరువక ముందే, ఆ శిధిలాల మంటలు ఆరక మునుపే ఈ రోజు తెల్లవారుజామున తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో మరో ఘోర బస్సు ప్రమాదం అమాయక ప్రయాణికుల ఉసురు తీసింది.
మీర్జాగూడ లో తాండూర్ డిపో బస్సు కంకర లోడుతో వెళ్తున్న డిప్పర్ ను ఢీ కొట్టడంతో ఆ కంకర లోడు మొత్తం బస్సు లోని ప్రయాణికుల పై పడి వారు ఊపిరాడక ప్రాణాలు విడిచారు. అయితే ఈ ఘటనలో టిప్పర్, బస్సు డ్రైవర్ తో సహా 24 మంది మృత్యువాత పడ్డారు.
అందులో 9 మంది మహిళలు, 10 మంది పురుషులు, ఒక చిన్నారి ఉంది. అలాగే ఈ ప్రమాదంలో 20 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. అయితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో అధికారులు జేసీబీలతో సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలోను వరుస విషాదాలు జరగడంతో తెలుగు రాష్ట్రాలలో యమధర్మ రాజు సంచరిస్తున్నారా.? అన్నట్టుగా ఒక్కో ఘటనలో పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. కర్నూల్ బస్సు దహనం మంటలు ఆరాక ముందే కాశీబుగ్గ తొక్కిసలాట ఏపీని ఉలిక్కిపడేలా చేసింది.
ఇక ఇప్పుడు చేవెళ్ల ప్రమాదం రెండు రాష్ట్రాల ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. మొన్న ఒక్కడి నిర్లక్ష్యం, ఒక్కడి వ్యసనం అంతమందిని బలితీసుకుంటే ఇప్పుడు ఒక్కరి అతివేగం ఇంతమంది చావులకు కారణమయ్యింది.
ప్రమాద స్థలంలో బాధితుల ఆర్తనాదాలు వింటున్నా, వారి కుటుంబ సంభ్యులు పెట్టె అహకారాలు చూస్తున్నా ఇటువంటి ప్రమాదాలు మరల పునరావృత్తం కాకూడదు భగవంతుడా అంటూ కోరుకునే లోపే అదే విషాదం, అవే శోకాలు అందరిని మనసులను కలిచివేస్తున్నాయి.
ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు, దానితో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. అలాగే ఇద్దరు పిల్లలు తమ తల్లిని కోల్పోయారు, మరియు గాయాలపాయైన తండ్రికి దూరమయ్యి దిక్కుతోచని దీన స్థితిలో తమ చుట్టూ ఎం జరుగుతుందో కూడా ఉహించలేక తనవారు కనిపించక బిక్కుబిక్కుమంటూ చూస్తున్న దృశ్యాలు హృదయాలను కదిలిస్తున్నాయి.
ఇక చావు అంచుల దాక వెళ్లి ప్రాణాలతో బయటపడిన వారు ఆ షాక్ నుంచి కోలుకోలేకపోతున్నారు. అయితే టిప్పర్ కంకర లోడుతో ఉండడం ఈ ప్రమాదంలో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ప్రభుత్వాలు కూడా ఇకనైనా ఇలా బాధ్యత రాహిత్యంగా రోడ్ల మీదకొచ్చి వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలు తీస్తున్న యమదుతల పై కఠిన చర్యలు తీసుకోవాలి.







