వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని మొట్టమొదటి సీఎస్ ను అవమానకర పరిస్థితులలో సాగనంపిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత ఏరికోరి ఢిల్లీ నుండి తెచ్చుకున్న నీలం సహానీ గురించి కూడా ఏవేవో వదంతులు వినిపిస్తున్నాయి. ఏపీలో ప్రభుత్వ పాలన సీఎస్‌కు తెలియకుండానే జరిగిపోతుందన్న వాదన బలంగా తెరపైకి వస్తుంది.
సీఎంవో నుండి వచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తే సరి… లేదంటే సీఎస్ అవునన్నా,… కాదన్నా జీవోలు, ప్రభుత్వ ఉత్తర్వులు రావటం మాత్రం ఆగటం లేదని ప్రచారం సాగుతోంది. గతంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం విషయంలో కూడా ఇదే జరిగేది. ఆయన కంటే సీఎంవోలోని ప్రవీణ్ ప్రకాష్ మాటే చెల్లుబాటు అయ్యేది.
తాజాగా ఏపీ హైకోర్టు తమ తదుపరి ఆదేశాల వరకూ అమరావతి నుండి కార్యాలయాల తరలింపు జరగకూడదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ ధిక్కరిస్తే దానికి అధికారులే మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. రాజధాని ప్రస్తావన లేకుండా పాలనా సౌలభ్యం కొరకు జీవోలతో సీఎం జగన్ పనికానిచ్చేస్తున్నారు.
ఇది అటు తిరిగి ఇటు తిరిగి సీఎస్, అధికారుల మెడకు చుట్టుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భయపడుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ గొడవ అంతా ఎందుకని నీలం సహానీ దీర్ఘకాలిక సెలవు మీద వెళ్ళిపోతారు అని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ప్రభుత్వానికి అది రాజకీయంగా ఇబ్బందే.



