అనకాపల్లి జిల్లాలో పలు మండలాలలో సోమవారం స్థానిక టిడిపి నేతలు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించి తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేశారు. మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో పాల్గొని ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఇదివరకు మన టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ షాపులలో బియ్యం, పంచదార, కందిపప్పు, ఉప్పు, గోధమపిండి, వంటనూనెలు, జొన్నలు తదితర నిత్యావసర సరుకులన్నీ అందించేవాళ్లం.
కానీ జగన్ అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకులు అన్నీ ఇవ్వకుండా వ్యానులు పెట్టి బియ్యం ఒక్కటే పంచుతూ దాని గురించే చాలా గొప్పలు చెప్పుకొంటున్నారు. అంటే ప్రజలు బియ్యం ఒక్కటే వండుకు తినాలని జగన్ భావిస్తున్నారా?కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యం కూడా నాలుగైదు నెలలుగా ఇవ్వడం లేదు. కనుక ఇకనైనా రేషన్ షాపులలో నిత్యావసర సరుకులన్నీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము,” అని అన్నారు. అనంతరం అయ్యన్న పాత్రుడు ఈ మేరకు అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.



