అధికారికంగా కాకుండా, లీకుల ద్వారా గానీ, పుకార్ల ద్వారా గానీ మెగా ఫ్యామిలీకి సంబంధించి ముందుగా ఓ వార్త బహిర్గతం అయితే, అబ్బే అందులో వాస్తవం లేదు, అదంతా ఒట్టి పుకారేనని ఖండిస్తారు. అయితే కాలక్రమేణా సదరు వార్త కార్యరూపం సిద్ధించుకోవడం జరుగుతుంది. తాజాగా చిరంజీవి చిన్నల్లుడు విషయంలోనూ ఇదే జరిగిందని నేడు పడిన ‘క్లాప్’ చెప్తోంది. అవును… చిరు తనయురాలి వివాహం సమయంలో కళ్యాణ్ ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసే విధంగా ఒప్పందాలు కుదిరాయని అప్పట్లో పుకార్లు షికార్లు చేసాయి.
దీనిపై నాడు స్పందించిన మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు… అలాంటిది ఏది లేదని, ప్రస్తుతం కళ్యాణ్ వ్యాపారం చేసుకుంటున్నాడని కొట్టిపారేశారు. అయితే వివాహం అనంతరం కళ్యాణ్ కు యాక్టింగ్, డ్యాన్స్, ఫైటింగ్ లలో శిక్షణ ఇప్పిస్తున్న విషయం బయటకు వచ్చింది. వీటిని ఎవరూ ఖండించలేదు, అలాగని సమర్ధించనూ లేదు. అయితే అవన్నీ కేవలం పుకార్లు కాదు, నికార్సైన నిజాలు అని తేలింది. వారాహి బ్యానర్ పై ‘జత కలిసే’ ఫేం డైరెక్టర్ రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేం మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది.
నిజానికి ఈ ఒక్క అంశంలోనే కాదు, మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ విషయంలోనైనా తీరు ఇలాగే ఉండడం అభిమానులకు కూడా అలవాటై పోయింది. గతంలో చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీ ప్రకటన విషయంలోనూ, చిరు నటించిన 150వ సినిమా అంశంలోనూ ఇదే పోకడను అనుసరించారు. ఏదైతేనేం… మొత్తమ్మీద మెగా హీరోల జాబితాలో చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ పేరు కూడా చేరిపోయింది. ‘కళ్యాణ్’ అన్న పేరు కలవడంతో, పవన్ కళ్యాణ్ అంతటి హీరో అవుతాడేమోనని వేచిచూడడం అభిమానుల వంతవుతోంది.



