ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 35ను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో సినీ వర్గాలన్నీ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి. మరి దీనిని జగన్ సర్కార్ ఏ విధంగా తీసుకోబోతోంది అన్నది పక్కన పెడితే, తాజాగా సోషల్ మీడియాలో ఓ కాపీ హల్చల్ చేస్తోంది.
గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వెలువడిన కాపీగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోన్న ఈ పత్రికా ప్రకటనలో… గుంటూరు జిల్లాలోని అన్ని థియేటర్లలో 08.04.2021వ తేదీన ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 35ను అనుసరించే సినిమా ప్రదర్శన ఉండాలని ఆదేశాలు ఇచ్చారు.
టికెట్ ధరల విషయంలో గానీ, షోల ప్రదర్శన విషయంలో గానీ నిబంధనలను అతిక్రమిస్తే థియేటర్లను సీజ్ చేస్తామని, అలాగే సినిమాటోగ్రఫీ చట్టం క్రింద భారీ జరిమానా విధిస్తామని ధియేటర్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. హైకోర్టు తీర్పు వెలువడిన 14.12.21 తేదీతోనే ఈ ప్రకటన కూడా వెలువడింది.
సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న ఈ ప్రకటన నిజంగా గుంటూరు జిల్లా కలెక్టర్ నుండే వెలువడిందో లేదో తెలియదు గానీ, ఇది గనుక నిజమైతే మళ్ళీ సినీ వర్గాల్లో వణుకు ప్రారంభమైనట్లే! అయితే ఇది ఒక్క గుంటూరు జిల్లా వరకే పరిమితమా? లేక ఇదే రూట్ లో మిగిలిన జిల్లాలు కూడా పయనిస్తాయా? అన్నది వేచిచూడాలి.
మౌఖికంగా ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు పేపర్ మీదకు వచ్చేపాటికి కొంత సమయం పడుతుంది గనుక అప్పటివరకు పాత జీవోను అమలు పరిచే యోచనలో భాగంగా ఈ ఆదేశాలు జారీ చేసారా? అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిర్ణయంతో ముందుకెళితే కోర్టు ఉల్లంఘన చర్యల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదేమో!?



