రామాయణాన్ని అధిక శాతం ప్రజల మనోభావాలను గౌరవించేలా తీయలేదన్న విమర్శలకు ఆదిపురుష్ బృందం ఎంత సమాధానం చెప్పాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. క్రేజ్ వల్ల మొదటి మూడు రోజులు మూడు వందల కోట్లు వసూలు చేసినా తర్వాత విపరీతంగా నెమ్మదించడంతో చివరాఖరికి ఫ్లాప్ ముద్ర తప్పడం లేదు.
కలెక్షన్ల సంగతి పక్కనపెడితే తాజాగా ఈ సినిమాని నిషేధించాలన్న పిటీషన్ మీద విచారణ జరిపిన అలహాబాద్ హై కోర్టు చేసిన వ్యాఖ్యలు లేవనెత్తిన ప్రశ్నలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. హిందూ మత సహనాన్ని చులకనగా తీసుకునే ఏ ప్రయత్నమైనా కళ్ళు మూసుకునే ప్రసక్తే లేదని చెప్పిన న్యాయ స్థానం అసలు సీత, హనుమంతుడిని కొరగాని వాళ్ళలా ఎందుకు చూపించారని నిలదీసింది.
డైలాగులు ఇప్పుడు మార్చడం కాదు, సర్టిఫికెట్ జారీ చేసే సమయంలో సెన్సార్ బోర్డు ఏం చేసిందని ప్రశ్నించింది. అంతే కాదు ప్రజలు ఎంతో ఓపికతో ఉండబట్టే ఇంత జరిగినా ఎలాంటి విధ్వంసాలకు పాల్పడకపోవడం అదృష్టమని పేర్కొంది. ఇంత సీరియస్ అంశాన్ని చూస్తూ వదిలేయమని ఘాటుగా స్పందించింది.
దీనికి బదులుగా సొలిసిటర్ జనరల్ చెప్పిన సమాధానం పట్ల కోర్టు ఎంత మాత్రం సంతృప్తి చెందలేదు. దేశంలో ఎందరో దినచర్య రామ్ చరిత్ మానస్ చదవడంతో మొదలవుతుందని, అంతటి పవిత్రమైన గ్రంథాన్ని తమ చిత్తానికి మార్చుకోవడం ఏమిటని అడిగింది. అంతే కాదు రాముడు రావణుడుతో సహా అందరి పాత్రలు పెట్టి ఇదసలు రామాయణమే కాదని రచయిత మనోజ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో బుకాయించడం పట్ల మొట్టికాయలు వేసింది.
ప్రదర్శనలు ఆపితే తప్ప ఈ వివాదానికి అడ్డుకట్ట ఉండదనే సంకేతం ఇచ్చింది. అయితే వాదోపవాదాలు ఇంకా పూర్తి కాలేదు. కొనసాగుతున్నాయి. నిర్మాతలు సుప్రీం కోర్టు దాకా వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఆలోగా ఆదిపురుష్ థియేట్రికల్ రన్ పూర్తవుతుంది. అప్పుడు తీర్పు ఎలా వచ్చినా పెద్దగా తేడా ఉండదు. కాకపోతే ఓటిటి స్ట్రీమింగ్ ని ఆపగలిగితే మాత్రం టి సిరీస్ నెత్తి మీద పిడుగు పడుతుంది.
కానీ అదంత సులభం కాదు. చాలా సమయం పడుతుంది. లేట్ అయితే అమెజాన్ ప్రైమ్ ఇచ్చే మొత్తంలో కోత పడొచ్చు. జనాలు మీకు పిచ్చోళ్లాలా కనిపిస్తున్నారా అని నేరుగా కోర్టు అడిగిందంటే అది చిన్న మ్యాటర్ కాదు. భవిష్యత్తులో ఇదే రామాయణం, మహాభారత భాగవతాలను ప్లాన్ చేసుకుంటున్న దర్శకనిర్మాతలకు ఈ పరిణామాలు ఒక హెచ్చరికే కావొచ్చు.



