ఖమ్మం జిల్లాలోని సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అనూహ్యంగా ఈ ఎన్నికలలో ఓడిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా విజయదుందుభి మోగించిన తెరాస జిల్లాలో మాత్రం కుదేల్ అయిపోయింది. కేవలం ఒక్కటంటే ఒకే సీటు సాధించగలిగింది. ఈ క్రమంలో పార్టీని జిల్లాలో బలోపేతం చెయ్యడానికి ప్రయత్నాలు మొదలెట్టింది పార్టీ నాయకత్వం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గేలం వెయ్యడం మొదలు పెట్టింది. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా ఖమ్మం పార్లమెంట్ సీటు ను దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది.
[m9ad]
ఈ క్రమంలో ఆ బాధ్యతను తుమ్మలకు అప్పగించారు కేసీఆర్. జిల్లాలోని ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలోని తీసుకురావడం, ఖమ్మం సీటును గెలిపించడం చేస్తేనే కేబినెట్ బెర్తు ఇస్తా అని చెప్పారట. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణ ఉండదని, ఇప్పుడు కొంత మందిని ఎన్నికలు పూర్తయ్యాక ఇంకొంత మందిని కేబినెట్ లోకి తీసుకోబోతున్నటు వార్తలు వస్తున్నాయి. ఆ క్రమంలో అన్ని లక్ష్యాలను సాధిస్తే రెండో విడతలో తుమ్మలకు కేబినెట్ బెర్తు దక్కవచ్చు.
ఈ లోగా మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో తుమ్మలను పెద్దల సభకు పంపే అవకాశం ఉంది. దీనితో తుమ్మల ఇప్పటికే రంగంలోకి దిగి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో మంతనాలు జరుపుతున్నారు. అయితే సండ్ర ఏకంగా తనకు కేబినెట్ పదవి ఇస్తే గానీ పార్టీ మారాను అని చెబుతున్నారట. మరోవైపు ఇప్పటికే కౌన్సిల్ లో కాంగ్రెస్ ను లేకుండా చేసింది తెరాస ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా శాసనసభలోనూ లేకుండా చెయ్యాలని చూస్తుంది.
తెలంగాణాలో కాంగ్రెస్ తరపున ఇటీవలే గెలిచిన ఎమ్మెల్యేలను మూడింట రెండొంతుల మంది అంటే 13 లేదా 14 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకుని రాగలిగితే కాంగ్రెస్ పక్షం తెరాస పక్షంలో విలీనం అయిపోయినట్టే. ఇప్పటికే 8 మంది సిద్ధంగా ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే నిజమైతే ప్రతిపక్ష హోదా పోవడం ఇప్పటికే దాదాపుగా ఖాయమైపోయినట్టే. ఇక విలీనం కూడా అయిపోతే సార్వత్రిక ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉంటుంది.



