కాంగ్రెస్ టీడీపీకి దూరమవుతుందా? దూరం నటిస్తుందా?

Chandrababu - Naidu - Rahul - Gandhiతెలంగాణ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా చేతులు కలిపాయి. జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీని గద్దె దించడమే లక్ష్యమంటూ చంద్రబాబు రాహుల్ గాంధీని కలిశారు. ఇద్దరూ కలిసి తెలంగాణ ఎన్నికలలో ప్రచారం కూడా చేశారు. అయితే పొత్తు వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా రెండు పార్టీలు ఘోర పరాజయం పొందారు. ఎన్నికల తరువాత రెండు మూడు సార్లు వారిద్దరూ కలిశారు. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధం అని ప్రకటించింది.

కాంగ్రెస్ టీడీపీ పొత్తు బూచిగా చూపిద్దాం అని ఆశపడిన ప్రతిపక్షాల ఆశలు అడియాసలు అయ్యాయి. పొత్తు వల్ల రెండు పార్టీల మధ్య ఓట్ల ట్రాన్సఫర్ జరగడం లేదని ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. చంద్రబాబు కూడా వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరే అని తేల్చి చెప్పారు. మరోవైపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగనున్న అఖిలపక్ష సమావేశనికి కాంగ్రెస్ రావడం లేదని తెగేసి చెప్పింది. సమావేశంపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానం అందలేదన్నారు.

ADVERTISEMENT

పార్టీ అధ్యక్షుడికి ఆహ్వానం పంపకుండా కార్యదర్శి జంగాగౌతమ్‌కు ఆహ్వానం పంపడం సరికాదని మండిపడ్డారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లమంటే చంద్రబాబు స్పందించలేదన్నారు. అయితే ఈ మండిపాటు, విరుచుకుపడటాలు కేవలం మాటలకే పరిమితం అని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ టీడీపీ ఒక అండర్ స్టాండింగ్ మేరకే దూరం నటిస్తున్నాయని వారి అభిప్రాయం. కలిసి పోటీ చేస్తే ఎలాగూ ప్రయోజనం లేదు కాబట్టి విడివిడిగా పోటీ చేసి కాంగ్రెస్ వల్ల ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేక ఓటు, వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఓటు చీలడమే మంచిదని వారి అభిప్రాయం.

అయితే ఈ పాచిక పారాలంటే చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీని కలవడం మానెయ్యాలి. అలాగే ఇక్కడ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెట్టాలి. ఇది ఎంత వరకూ జరుగుతుందో చూడాలి. కాంగ్రెస్ విషయానికి వస్తే ఒంటరి పోరు వల్ల ఇప్పుడు ఆ పార్టీ వరుసగా ఇంకో సారి శాసనసభకు దూరం అయ్యే అవకాశం ఉంది. ఒకప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు వరుసగా రెండు సార్లు సున్నా సీట్లకు పరిమితం అవ్వడమంటే అది రాష్ట్ర విభజన తాలూకు స్వయం కృతాపరాధమే.

ADVERTISEMENT
Latest Stories