ఏ పార్టీలో అయినా నాయకులకన్నా కార్యకర్తలే ఎక్కువగా ఉంటారు కానీ ఒక్క కాంగ్రెస్ పార్టీలో మాత్రమే కార్యకర్తలతో సమానంగా నాయకులుంటారు. ఈ పార్టీ నాయకులలో ఉండే వాక్ స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులు పరిమితికి మించి ఉంటాయి.
అందుకు పార్టీ అధినేత నుంచి జాతీయ నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అందరు అర్హులే అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. అయితే పదేళ్ల పోరాటం ఫలితమో, లేక పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత కారణమో కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
అయితే ఆ వచ్చిన అధికారాన్ని కాంగ్రెస్ నేతలు అధిష్టానం నుంచి కనీసం ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన వచ్చే వరకైనా నిలబెట్టుకుంటారా.? అంటూ ప్రత్యర్థి పార్టీల నేతలు హేళన చేసారు. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పాస్ అవ్వడంతో రేవంత్ సర్కార్ మహా ఉంటే ఆరు నెలలు, లేదా ఒక ఏడాది సజావుగా ఎటువంటి అంతర్గత వాగ్వాదాలు లేకుండా పాలన చేస్తుంది అంటూ అపహాస్యం చేసారు విపక్ష నేతలు.
ఆ విమర్శలలోను కాంగ్రెస్ ప్రత్యర్థుల నుండి గట్టెకిందిలే, ఇక ఈ ఐదేళ్ల రేవంత్ సర్కార్ అధికారానికి పార్టీలోని అంతర్గత విభేదాలు అడ్డుగోడలు కావు అనుకునే లోపే నేనున్నాను అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బయటకొచ్చారు. సొంత పార్టీ నేత, సొంత సామజిక వర్గానికి చెందినవాడు, ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా ప్రకటనలు చేసారు.
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతూ పార్టీ వ్యతిరేక విధానాలతో అసెంబ్లీని బహిష్కరించి కాంగ్రెస్ పార్టీ అసలు సిసలైన రాజకీయానికి తెరలేపారు రాజగోపాల్ రెడ్డి. అయితే ఇదంతా తనకు ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కనందుకేలే అనుకుని సరిపెట్టుకున్న కాంగ్రెస్ మద్దతుదారులకు పొన్నం ప్రభాకర్ – మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రూపంలో మరో వివాదం క్షమాపణల వరకు వెళ్ళింది.
ఇక ఇప్పుడు తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రూపంలో, మంత్రి కొండా సురేఖ గండంలో మరోకొత్త అంతర్గత విభేదం కాంగ్రెస్ పార్టీ తలుపు తట్టింది. మేడారం సమ్మక్క – సారక్క జాతర పనులలో మంత్రి పొంగులేటి ఆధిపత్యం ఎక్కువయ్యిందంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ నుండి హై కమాండ్ వరకు ఫిర్యాదులు పంపింది.
తన శాఖలో మంత్రి పెత్తనం పై ప్రశ్నలు సంధిస్తూ హై కమాండ్ కు మంత్రి సురేఖ లేఖలు రాసినట్టు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. పొంగులేటి ఈ జాతర పనులలో భారీ టెండర్లను తన మనుషులకు ఇప్పిస్తున్నారని, తద్వారా సమ్మక్క – సారక్క జాతర నిర్వహణలో పెత్తనం చెలాయించాలని చూస్తున్నారంటూ సురేఖ దంపతులు పొంగులేటి జోక్యం పై అంతర్గతంగా రగిలిపోతున్నారంటూ కాంగ్రెస్ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే కాంగ్రెస్ పార్టీకి ఈ అంతర్గత కుమ్ములాటలు, ఈ సొంత పార్టీ నేతల మధ్య లుకలుకలు కొత్తేమి కాదని, కాంగ్రెస్ పార్టీ అసలుసిసలైన రాజకీయం ఇదే అంటూ కామెంట్స్ వినిపడుతున్నాయి.







