వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి అప్పుడే 5 ఏళ్ళు కావస్తోంది. కానీ ఇంతవరకు ఆయనను హత్య చేసింది.. చేయించింది ఎవరో ఏపీ పోలీసులు, సీబీఐ కూడా కనుగొనలేకపోయాయి. ఇంతమంది సాక్షులు, ఆధారాలు ఉన్నా హంతకులను, వారి వెనుక ఉన్నవారిని కనుగొనలేకపోవడం వారి అసమర్దతగా కనిపిస్తున్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్ళు, ప్రభావం కారణంగానే కేసు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయిందని అందరికీ తెలుసు.
ఈ కేసులో ప్రధాన నిందితులలో ఒకడిగా ఉండి అప్రూవరుగా మారిన దస్తగిరి వేరే కేసులలో నాలుగు నెలలు కడప జైలో గడిపిన తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. వస్తూనే జగన్, అవినాష్ రెడ్డిలని ఉద్దేశ్యించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
“వివేకా హత్య విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. అందుకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకే అప్రూవరుగా మారి ఈ కేసుకు సంబందించి నాకు తెలిసిన అన్ని విషయాలను సీబీఐ అధికారులకి తెలియజేశాను.
నేను కడప జైల్లో ఉన్నప్పుడే, ఈ కేసులో నిందితుడుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి వచ్చి నన్ను కలిశారు. ఆయన నాకు డబ్బు ఆశ జూపి సీబీఐ ఎస్పీ రాంసింగ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని, ఈ కేసులో వైసీపి పెద్దలకు ఇబ్బంది కలిగించే విషయాలు బయటపెట్టవద్దని కోరారు. కానీ నేను లొంగకపోవడంతో నాకు బెదిరింపులు మొదలయ్యాయి.
నేను ఈ కేసులో చిక్కుకున్నప్పుడే నా ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిందని గ్రహించాను. కనుక ఇప్పుడు వెనక్కు తగ్గినా ముందుకు సాగిన నా పరిస్థితిలో మార్పు ఏమీ ఉండబోదు. ప్రాణాల మీద ఆశ వదులుకునే ఇప్పుడు జైలు నుంచి బయటకు వస్తున్నాను.
నా ఇల్లు అవినాష్ రెడ్డి ఇంటికి సమీపంలోనే ఉందంటే నా పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. అయినా కూడా నేను సిఎం జగన్, అవినాష్ రెడ్డిల బెదిరింపులకి భయపడను.
గత ఎన్నికలలో వివేకా హత్యని చూపించి ప్రజల సానుభూతితో జగన్ గెలిచారు కదా? ఆయనకు దమ్ముంటే వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో ప్రకటించి ప్రజలను ఓట్లు అడగాలి,” అని దస్తగిరి సవాలు చేశాడు. స్వీకరించగలరా?
ఈ కేసులో ప్రధాన నిందితులలో ఒకడిగా ఉన్న దస్తగిరి ఇంత స్పష్టంగా ఈ కేసు గురించి చెపుతున్నా హంతకులు, కుట్రదారులు ఎవరో సీబీఐకి, కోర్టులకు అర్దం కావడం లేదంటే చాలా విడ్డూరంగా ఉంది కదా?




