స్టార్ హీరోలను మించి ఒక మెట్టు రాజమౌళి పైన ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే… సహజంగా స్టార్ హీరోల వెంట దర్శకులు పరుగులు పెడతారు, కానీ ప్రస్తుతం రాజమౌళి వెంట స్టార్ హీరోలు పరుగులు పెట్టే పరిస్థితి నెలకొంది. అందుకే హైదరాబాద్ పోలీస్ డిపార్టుమెంటు తమ నూతన క్యాంపెయిన్ కోసం స్టార్ హీరోలను పక్కన పెట్టి, ‘బాహుబలి’తో టాక్ ఆఫ్ ది నేషన్ గా మారిన రాజమౌళిని సంప్రదించారు.
ఇందులో భాగంగా హైదరాబాద్ ట్రాఫిక్ – 2 డిసిపి ఎవి రంగనాథ్ రాజమౌళితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రజలలో ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన పెంచేందుకు పోలీస్ డిపార్టుమెంటు చేపట్టనున్న చర్యలను వివరించి, అందుకు తగిన విధంగా క్యాంపెయిన్ చేయడానికి రాజమౌళి సహాయ సహకారాలు అడిగినట్లుగా తెలుస్తోంది. సామాజిక బాధ్యత రీత్యా ఇందుకు జక్కన్న కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
దీనిపై స్పందించిన డిసిపి రంగనాథ్, ‘ఓ కార్యక్రమం కోసం రాజమౌళిని ఆహ్వానించిన మాట వాస్తవమే గానీ, దాని గురించి ఇప్పుడే చెప్పడానికి ఏమీ లేదని’ దాటవేశారు. అయితే జూలై రెండవ వారంలో ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కావచ్చని సమాచారం. ‘బాహుబలి’ చిత్ర దర్శకుడు రాజమౌళితో పాటు, టైటిల్ రోల్ పోషించిన ప్రభాస్ మరియు భళ్ళాలదేవుడు రానాలు కూడా ఈ క్యాంపెయిన్ లో భాగస్వామ్యులు కాబోతున్నారు.


