ప్రజలకు ఉపయోగపడని రాజకీయ అనుభవం ఎంతుంటే ఏం ప్రయోజనం సారూ?

YSRCP-Dharmana-Prasada-Raoఒలింపిక్ పోటీలలో పాదయాత్రల పోటీ పెడితే మన రాజకీయ నాయకులకే స్వర్ణ పతకాలు సాధించడం ఖాయం. ఎందుకంటే మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలన్నా, పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలన్నా పాదయాత్రలు చేయడం తప్పనిసరి అయిపోయింది కనుక. అయితే పాదయాత్రలే పదవులకు అర్హత అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అభిప్రాయపడుతున్నట్లున్నారు.

ఈరోజు శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని లింగాలవలసలో గడప గడపకి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అడుగడుగునా ఆయనకి జనసేన, పవన్‌ కళ్యాణ్‌ పోస్టర్లే కనిపించడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. స్థానిక యువకులలో చాలా మంది పవన్‌ కళ్యాణ్‌ అభిమానులున్నందున ఆ ఊర్లో జనసేన, పవన్‌ కళ్యాణ్‌ పోస్టర్లున్నాయి. వాటిని ఏర్పాటు చేసిన యువత కింద తమ ఫోటోలు వేసుకోవడం పరిపాటి. కనుక స్థానిక యువత జనసేన వెంట ఉన్నారని గ్రహించిన మంత్రి ధర్మాన బాగానే గ్రహించారు.

ADVERTISEMENT

ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “సినిమాలలో హీరోలు నిజ జీవితంలో హీరోలు కాలేరు. సినిమాలలో ఏదైనా సాధించినట్లు చూపగలరు. కానీ రాజకీయాలలో అలా సాధ్యం కాదు. ఎంతో శ్రమ, రాజకీయాల పట్ల అవగాహనం, నిబద్దత, ప్రజాభిమానం అన్నీ ఉంటేనే కానీ రాజకీయాలలో నెగ్గుకు రాలేరు. పవన్‌ కళ్యాణ్‌ కూడా అంతే. ఆయన ఒక కాలు రాజకీయాలలో, మరో కాలు సినిమాలలో పెట్టి రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు.

సినిమాలలో ఆయన పోస్టర్లు చూసి రాజకీయాలలో కూడా ఏదో చేసేస్తాడనుకొంటే అదంతా ఒట్టి భ్రమ. నేను 45 ఏళ్ళుగా రాజకీయాలలో ఉన్నాను. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తట్టుకొని నిలబడగలిగాను. అదే పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికలలో ఓడిపోగానే మళ్ళీ సినిమాలలోకి వెళ్ళిపోయాడు. అతను నాతో గట్టిగా మూడు కిలో మీటర్లు కూడా పాదయాత్ర చేయలేడు. ఇక రాజకీయాలలో ఎలా నిలదొక్కుకొంటాడు?” అని అన్నారు.

ధర్మాన ప్రసాద రావు అపార రాజకీయ అనుభవం ఉన్నవారే కావచ్చు కానీ ఎమ్మెల్యేగా తన నియోజకవర్గాన్ని, మంత్రిగా తన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన కనబడదు. ఒకవేళ ఉండి ఉంటే శ్రీకాకుళం జిల్లా నేడు ఇంత దయనీయ దుస్థితిలో ఉండేదే కాదు. ప్రస్తుతం ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ కనీసం శ్రీకాకుళం పట్టణాన్ని కూడా అభివృద్ధి చేయకుండా వచ్చే ఎన్నికలలో మళ్ళీ గెలవడం కోసం గడప గడపకి తిరుగుతున్నారు.

కనుక పాదయాత్రలు, రాజకీయాలు చేస్తూ ఎన్నేళ్ళు కాలక్షేపం చేసినా అటువంటి ప్రజా ప్రతిధుల వలన ఉపయోగం లేదు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిచూపి వారి గుండెల్లో కొలువవ్వాలి. ఆనాడు కింజారపు ఎర్రంనాయుడు ఆవిదంగా చేయబట్టే ఆయన చనిపోయినా నేటికీ జిల్లా ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారు.

పవన్‌ కళ్యాణ్‌లో కూడా అటువంటి నీతి, నిజాయితీ, నిబద్దత ఉందని భావించబట్టే మంత్రిగారి నియోజకవర్గంలో యువత పవన్‌ కళ్యాణ్‌ను ఆరాధిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ స్థానంలో తన బ్యానర్స్ ఉండాలని మంత్రి ధర్మాన కోరుకొంటే, ముందు తన నియోజకవర్గాన్ని, తర్వాత తన శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేసి చూపిస్తే చాలు… నెత్తిన పెట్టుకొంటారు.

ADVERTISEMENT
Latest Stories