ధర్మేంద్ర బతికే ఉన్నాడు, కానీ మీడియా మాత్రం చనిపోయింది!

dharmendra-death-rumours-hema-malini-responds-strongly

ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన మీడియాలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ధర్మేంద్ర ఇక లేరంటూ వార్తలు వచ్చాయి. గత కొంతకాలంగా వృదాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ధర్మేంద్ర (89) ఈరోజు ఉదయం ముంబాయిలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో కన్నుమూశారని వాటి సారాంశం.

బాలీవుడ్‌లో 300కి పైగా సినిమాలు చేసిన ధర్మేంద్ర చాలా సీనియర్, చాలా పాపులర్ హీరో. కనుక అయన గురించి ఇటువంటి వార్తని అందరి కంటే ముందుగా ప్రసారం చేయాలని మీడియా తాపత్రయ పడింది తప్ప ఆయన కుటుంబ సభ్యులను అడిగి ధ్రువీకరించుకోలేదు.

ADVERTISEMENT

ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కనుక హాస్పిటల్ సిబ్బంది ఎవరో ఈ విషయం లీక్ చేస్తే ధర్మేంద్ర చనిపోయారంటూ మీడియా సంస్థలు పోటాపోటీగా వార్తలు ప్రసారం చేసేశాయి.

సంచలన వార్తలు ప్రసారం చేసి టిఆర్‌పీ రేటింగ్స్, పాపులారిటీ పెంచుకోవాలనే ఆరాటమే తప్ప ఇటువంటి తప్పుడు వార్తల వలన ఆయన కుటుంబ సభ్యులు ఎంత బాధ పడతారో గ్రహించడం లేదు.

ఈ వార్తలపై ఆయన భార్య హేమమాలిని, కుమార్తె ఇషా డియోల్ తీవ్రంగా స్పందించారు. “మీడియాలో వస్తున్న ఈ వార్తలు క్షమించరాని నేరం. ధర్మేంద్రకు హాస్పిటల్లో చికిత్స జరుగుతోంది. చికిత్సకు ఆయన స్పందిస్తున్నారు.

ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. కానీ ఈవిదంగా తప్పుడు వార్తలు ప్రసారం చేయడం ఆయనని అగౌరవపరచడమే… భాధ్యతారాహిత్యమే. దయచేసి మా ప్రైవసీని గౌరవించండి,” అని ట్వీట్ చేశారు. వారి కుమార్తె ఇషా డియోల్ కూడా ఈ వార్తలను ఖండించారు.

సేలబ్రేటీల విషయంలో ఈవిదంగా జరగడం ఇదే మొదటిసారి కాదు. కోటా శ్రీనివాసరావు వంటి అనేకమంది నటీనటులు తాము ఇంకా జీవించే ఉన్నామని దయచేసి మమ్మల్ని అప్పుడే చంపెయవద్దని మీడియాని వేడుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.

మీడియా సంస్థల మద్యనే విపరీతమైన పోటీ నెలకొని ఉండగా ఇప్పుడు సోషల్ మీడియా కూడా వాటికి పోటీగా మారడంతో ‘బ్రేకింగ్ న్యూస్ పోటీలు’ ఇంకా పెరిగిపోయాయి. మీడియాలో వస్తున్న ఇటువంటి వార్తలు చూస్తున్నప్పుడు ‘ఆ నలుగురు’ సినిమా చూపిస్తున్నట్లే అనిపిస్తుంది కదా?

ADVERTISEMENT
Latest Stories