చిన్న సినిమా ఆడకపోతే ప్రేక్షకులదే తప్పా?

Dheeraj Mogilneni on Summer Holidays audience response

చిన్న సినిమాను ప్రేక్షకుల దాకా తీసుకెళ్లడం కష్టమే. కానీ ఆ కష్టానికి ఫలితం కనిపించకపోతే ప్రేక్షకుల్ని తప్పుపట్టడం ఎంతవరకు సరైంది? సమ్మర్ హాలిడేస్ నిర్మాత ధీరజ్ మొగిలినేని మాటలు వింటే ఇదే అనిపిస్తుంది.

ఇద్దరు పిల్లలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రచారాన్ని ఆయనే మోశారు. స్వయంగా తనే వీడియో ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఓటీటీ, థియేటర్ల పరిస్థితుల గురించి మాట్లాడారు. తన ఇంటర్వ్యూల ద్వారా సినిమాను వార్తల్లో ఉంచేందుకు ప్రయత్నించారు.

ADVERTISEMENT

కానీ ఈరోజు వేదికపై ఆయన మాట్లాడిన తీరు మాత్రం ప్రశ్నించాల్సిందే. బత్తా, దోరతి సినిమాలను మెచ్చుకున్న ఓ యూట్యూబర్ వీడియోను చూపిస్తూ, “మీకు పక్కింటి కూర మాత్రమే నచ్చుతుంది” అన్నారు. తెలుగు చిన్న సినిమాలను ప్రోత్సహించడం లేదంటూ మాట్లాడే క్రమంలో ఇక్కడ తెలుగు లో మంచి సినిమా తీస్తే ఎవడు థియేటర్ కి రాడు అంటూ ప్రేక్షకుడిని ‘ఎవడు’ అనే పదం కూడా వాడేశారు!

మంచి సినిమాలను చూడాలనే ఉద్దేశంతో చెప్పినా, ప్రేక్షకుల గురించి ఇలాంటి భాషలో మాట్లాడటం గౌరవంగా అనిపించదు. సినిమా చూడటానికి రాలేదని నేరుగా వాళ్లనే తప్పుపట్టడం కూడా సరికాదు.

చిన్న సినిమా థియేటర్లలో నిలబడటానికి మంచి ఉద్దేశం ఒక్కటే సరిపోదు. చూసినవాళ్లు దాని గురించి ఎంత బలంగా చెబుతున్నారు అనేది ముఖ్యం. వాళ్ల మాటలు విని మరికొందరు టికెట్ కొనే స్థాయిలో సినిమా ప్రభావం చూపించాలి.

సమ్మర్ హాలిడేస్ విషయంలో ముందుగా చూసుకోవాల్సింది అదే. ప్రేక్షకుల్ని థియేటర్లకు కదిలించేంత టాక్ సినిమాకు వచ్చిందా? రాకపోతే, ఎందుకు రాలేదో సినిమా వైపు కూడా చూసుకోవాలి.

రెండోది ప్రచారం. నిర్మాత ఎన్నో ఇంటర్వ్యూలు ఇవ్వడం ఒకటి. అవి చూసిన ప్రేక్షకుడికి సినిమా చూడాలనిపించడం మరొకటి. ప్రచారం కోసం పడిన కష్టం, టికెట్ కొనాలనే ఆసక్తిగా మారిందా అన్నది అసలు ప్రశ్న?

ఈ రెండింటినీ పరిశీలించకుండా ప్రేక్షకుల మీద అసహనం చూపించడం వల్ల ఉపయోగం ఉండదు.

చిన్న సినిమాలకు ప్రేక్షకుల ప్రోత్సాహం కావాలి. కానీ వాళ్లను తప్పుపట్టడం ద్వారా ఆ ప్రోత్సాహం రాదు.

ADVERTISEMENT
Latest Stories