మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న “ధృవ” సినిమా ఆడియోకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు సరిగ్గా ఆన్ లైన్ లో ఆడియోను విడుదల చేయనున్నామని స్వయంగా రామ్ చరణ్ మరియు ఆడియో సంస్థ ఆదిత్యా ప్రకటించారు. అయితే ఈ అర్ధరాత్రి ఆడియో విడుదలపై ప్రేక్షకుల నుండి నెటిజన్ల నుండి భిన్న స్పందనలు వస్తున్నాయి.
అభిమాన హీరోలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఫ్యాన్స్ దానికి జై కొట్టడం ఒక వైపు ఉంటే… మిడ్ నైట్ షోలు చూసాము గానీ, ఈ మిడ్ నైట్ ఆడియో రిలీజ్ లు ఏంటోనంటూ… మరో వైపు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే టాలీవుడ్ ఏది కొంచెం కొత్తగా జరుగుతున్నా… వినపడే ఏకైక పదం ‘ట్రెండ్ సెట్టింగ్.’ మరి నిజంగానే రామ్ చరణ్ ‘ధృవ’ సినిమా ఆడియోతో ‘ట్రెండ్ సెట్టర్’గా నిలుస్తాడా? భవిష్యత్తులో పెద్ద హీరోల సినిమాల ఆడియోలు ఇలాగే విడుదల అవుతాయా?
‘ధృవ’ సినిమా కోసం చెర్రీ అవలంభిస్తున్న విధానం కొత్తగా ఉండొచ్చు గానీ, ‘ధృవ’ మాదిరి ప్రమోషన్స్ భవిష్యత్తులో అయితే సాగకపోవచ్చనే మాటలే విరివిగా వినపడుతున్నాయి. ఆడియో వేడుకలే సినిమా ప్రమోషన్స్ కు ప్రధాన ఫ్లాట్ ఫాంగా మారిన తరుణంలో… వాటిని పక్కన పెట్టి, ఇలాంటి అర్ధరాత్రి ఆడియో రిలీజ్ లు జరుపుకోవడం పెద్దగా వర్కౌట్ కాకపోవచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం.
అయితే ‘హీరోల భజన’ కార్యక్రమాలుగా మారిపోయిన రొటీన్ ఆడియో వేడుకల కంటే ఇవే నయమంటున్న వారి సంఖ్య మాత్రం గణనీయంగానే ఉంటోంది. ఇది కాస్త ఆలోచించదగ్గ విషయమే మరి! నిజమే… ఆడియో వేడుకలంటే సంగీత దర్శకుడు, పాటల రచయితలు, గాయనీ గాయకులకు అసలు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఒక్కో వేడుకలలో అయితే అసలు సంగీత దర్శకుడు పేరు కూడా పలకకుండానే ఆడియో రిలీజ్ లు అయిపోతుంటాయి. అలాంటి ‘హీరోల భజన’ వేడుకల కన్నా… ఈ అర్ధరాత్రి రిలీజ్ లే ఉత్తమం అంటున్నారు విసిగిపోయిన వీక్షకులు.


