జగన్‌, నారా లోకేష్‌ మద్య ఈ తేడా గమనించారా?

Nara Lokesh

ఏదైనా సినిమా రిలీజ్ అయ్యే ముందు ఆ సినిమా దర్శక నిర్మాతలు, హీరో హీరోయిన్లు తమ సినిమా గురించి గొప్పగా చెప్పుకొని ప్రేక్షకులను ఆకర్శించేందుకు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి కూడా ఇప్పుడు అలాగే చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌ తదితరులు కూడా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే వారు ఎప్పుడూ మీడియాకు అందుబాటులోనే ఉంటారు. మీడియాతో ముఖాముఖిమాట్లాడుతూనే ఉంటారు. కనుక ఇప్పుడు వారు మీడియాతో మాట్లాడటం సహజంగానే ఉంటుంది.

ADVERTISEMENT

కానీ 5 ఏళ్లలో ఎన్నడూ మీడియాతో ముఖాముఖీ మాట్లాడని జగన్మోహన్‌ రెడ్డి ఇప్పుడు మాట్లాడటమే విచిత్రం. బహుశః వైసీపి ఓటమి అంచున ఉందనే ఆందోళనతో ఉన్నందునే ఈ సాహసానికి కూడా పూనుకొంటున్నారేమో? అనే సందేహం కలుగుతుంది.

తాజాగా ప్రముఖ జాతీయ న్యూస్ మీడియా ‘ఇండియా టుడే’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే కొన్ని ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పుకోలేక తడబడగా, మరికొన్నిటికి సంబంధం లేని సమాధానాలు, ఎదురు ప్రశ్నలతో సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు.

అయితే చంద్రబాబు నాయుడుని జైలుకి పంపడం గురించి మాత్రం స్పష్టంగానే సమాధానం చెప్పారు. “న్యాయస్థానం ఆయనను ఓ కేసులో 52 రోజులు బెయిల్‌ ఇవ్వకుండా జైల్లో ఉంచిందంటే ఆయన తప్పు చేశారని భావించబట్టే కదా?

ప్రతీ వ్యక్తికి బెయిల్‌ పొందే అవకాశం ఉంటుంది కనుక ఆయన కూడా బెయిల్‌పై బయటకు రాగలిగారు. అయితే ఇప్పుడు బయటకు వచ్చినప్పటికీ ఏదో రోజు న్యాయస్థానం తీర్పు చెపుతుంది. అప్పుడు తప్పించుకోలేరు,” అని జగన్‌ సమాధానం చెప్పారు.

దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ ఏవిదంగా స్పందిస్తారో సులువుగానే ఊహించవచ్చు. “చంద్రబాబు నాయుడు 52 రోజులు జైల్లో ఉంటే నేరం చేశారనుకుంటే, మరి అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన మీరు ఎంత నేరం చేశారో? చంద్రబాబు బెయిల్‌ గురించి మాట్లాడిన జగన్మోహన్‌ రెడ్డి పదేళ్ళుగా తాను బెయిల్‌పై ఉన్నారనే విషయం మరిచిపోయారా?” అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

ఐదేళ్ళ తర్వాత ఎన్నికలకు ముందు అంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను, నియోజకవర్గం ఇన్‌చార్జిలను ఎందుకు మార్చాల్సి వచ్చింది? ప్రజలను మీ ఫోటోని మాత్రమే చూసి వైసీపి అభ్యర్ధులకు ఓట్లు వేయమని అడుగుతున్నప్పుడు అభ్యర్ధులను ఎందుకు మార్చవలసి వచ్చింది? మీ ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత ఉందని భావిస్తున్నారా? అందుకే అభ్యర్ధులను మార్చారా?” అనే ప్రశ్నకు ‘ఇది చాలా పెద్ద ప్రశ్న’ అంటూ జగన్‌ సమాధానం దాటవేశారు.

ఉద్యోగాల కల్పన గురించి అడిగిన ప్రశ్నకు, “ఓ ప్రభుత్వం లేదా పరిశ్రమ ఎన్ని ఉద్యోగాలు కల్పించగలదు? అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యమేనా? అని ఎదురు ప్రశ్న వేశారు.

బటన్ నొక్కుడు సభల్లో ‘థాంక్యూ సిఎం సార్’ అనే వాళ్ళనే పోగేసుకొస్తారు కనుక అక్కడ పొగిడేవారే తప్ప ఇలా ప్రశ్నించేవారు ఉండరు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా ఎదురుగా నిలబడి ప్రశ్నించవు వేర్వేరు వేదికలపై నుంచి మాట్లాడుతుంటారు కనుక వాటితో కూడా ఇబ్బంది ఉండదు. కానీ ఇలా మొహం మీద మైక్ పెట్టి సమాధానం చెప్పమంటేనే చాలా కష్టం.

పప్పు, చవట, దద్దమ్మ అంటూ వైసీపి అవహేళన చేసిన నారా లోకేష్‌ కూడా ఈ 5 ఏళ్ళలో సానపట్టిన కత్తిలా తయారయ్యి యువగళం పాదయాత్రలో వివిద వర్గాల ప్రజలతో, రైతులతో, మీడియాతో, చంద్రబాబుని జగన్‌ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు ఢిల్లీలో జాతీయ మీడియాతో ముఖాముఖీ మాట్లాడారు.

రాష్ట్రానికి సంబందించి ఏ సమస్య, అంశం గురించైనా సాధికారంగా మాట్లాడి అందరినీ మెప్పిస్తున్నారు. కానీ భారీ మెజార్టీతో 5 ఏళ్ళు ఇష్టారాజ్యం చేసిన జగన్మోహన్‌ రెడ్డి నేటికీ పార్టీ, ప్రభుత్వం, రాష్ట్రంలో సమస్యల గురించి ఏకాంతంగా మీడియాని ఎదుర్కోలేక ఈవిదంగా తడబడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది కదా?

ADVERTISEMENT
Latest Stories