జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు: పార్టీల కోసమే!

Do elections really help the people?

ఎన్నికలలో గెలిచి అధికారం దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు తాపత్రయపడుతుంటే, వాటికి తోడ్పడుతుంటారు ప్రజలు. అందుకు ప్రతిగా అవి ప్రజలకు ఏం చేస్తున్నాయి? అని ఆలోచిస్తే సంతృప్తికరమైన సమాధానం లభించదు.

బీఆర్ఎస్‌ పార్టీ నుంచి బహిష్కరించబడి, ప్రస్తుతం తెలంగాణ జాగృతి పేరుతో జనం మధ్య తిరుగుతున్న కల్వకుంట్ల కవిత కూడా ఇదే మాట చెప్పారు.

ADVERTISEMENT

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల గురించి మాట్లాడుతూ, “ఈ ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలిచినా, ఓడినా ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. అందుకే మేము ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉంటున్నాము,” అని కవిత చెప్పారు.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలలో మూడు ప్రధాన పార్టీలు ఆ సీటు దక్కించుకోవడం కోసమే పోరాడుతున్నాయని అందరికీ తెలుసు. కానీ ఈ ఉప ఎన్నికలలో తమ గెలుపు ప్రజలకు చాలా ముఖ్యమన్నట్లు ప్రచారం చేస్తున్నాయి.

పోనీ రాష్ట్ర స్థాయిలో జరిగే ఎన్నికలతో ప్రజలకు ఏమైనా మేలు కలుగుతోందా?అంటే ప్రస్తుతం ఎన్నికలకు వెళుతున్న బీహార్‌ రాష్ట్రాన్ని చూస్తే కాదని ఎన్నికల ప్రచారంలో పాల్గొనే పార్టీలే చెపుతున్నాయి.

‘జన సూరజ్’ పార్టీతో ఎన్నికల బరిలో దిగిన ప్రశాంత్ కిషోర్‌, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు గడిచినా నేటికీ బిహార్ ప్రజలు పొట్ట చేత్తో పట్టుకొని ఇతర రాష్ట్రాలకు వలసలు పోతూనే ఉన్నారని ఆరోపించారు.

గతంలో కాంగ్రెస్‌ కూటమి, ఇప్పడు ఎన్డీయే అధికారంలో ఉన్నా బిహారీల ఈ పరిస్థితిలో మార్పు రాలేదన్నారు. బీహార్‌లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నా అభివృద్ధికి నోచుకోవడం లేదు. కానీ బీజేపి పాలిత గుజరాత్ అభివృద్ధి చెందుతోందన్నారు.

ఒక్క బిహార్ మాత్రమే కాదు దేశంలో తెలంగాణతో సహా పలు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూనే ఉన్నాయి.

కానీ ఏపీలో ‘డబుల్ ఇంజిన్ బుల్లెట్ రైల్ సర్కార్’ నేతృత్వంలో ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి నారా లోకేష్‌ చెపుతున్నారు.

ప్రశాంత్ కిషోర్‌ ఆరోపణలు వాస్తవమే… మంత్రి నారా లోకేష్‌ చెపుతున్నవీ వాస్తవమే. కనుక అభివృద్ధి రాజకీయాలతోనే ముడిపడి ఉంటుంది కానీ అవి సకారాత్మకంగా ఉన్నప్పుడు మాత్రమే అని సర్ది చెప్పుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories