తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకొని జనసేన తొలిసారిగా 8 సీట్లకు పోటీ చేస్తోంది. కొమ్ములు తిరిగిన బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్ధులతో పోటీ పడుతున్న జనసేన అభ్యర్ధులకు పవన్ కళ్యాణ్ పూర్తి సహాయసహకారాలు అందిస్తారనుకోవడం అత్యాశ కాబోదు. కానీ పవన్ కళ్యాణ్ తాంబూలాలు ఇచ్చేశామన్నట్లు టికెట్స్, బీఫారంలు ఇచ్చేశాము… మీ తిప్పలు మీరు పడండి అన్నట్లు జనసేన అభ్యర్ధులను బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వదిలేశారు.
ఈ నెల25న ప్రధాని నరేంద్రమోడీ, 26న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ వారితో కలిసి హైదరాబాద్ రోడ్ షోలో, కూకట్‌పల్లిలో ఎన్నికల ప్రచారసభలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. మరి జనసేనలో మిగిలిన ఏడుగురు అభ్యర్ధుల పరిస్థితి ఏమిటి?
Also Read – వర్రాని వైసీపియే లేపేస్తుందేమో? బీటెక్ రవి
ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకే ఎన్నికల ప్రచారానికి గడువు ఉంది. ఆలోగా పవన్ కళ్యాణ్ వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో కూడా సభలు, రోడ్ షోలు నిర్వహించి వారి తరపున కూడా ప్రచారం చేస్తారా లేదా?చేయకపోతే వారిని ఎన్నికల బరిలో దించి ప్రయోజనం ఏమిటి?
తెలంగాణలో బీజేపీని గెలిపించుకొనేందుకే ఆ పార్టీ పెద్దలు పవన్ కళ్యాణ్‌ని ఒప్పించి జనసేనతో పొత్తుపెట్టుకొన్నారు. పవన్ కళ్యాణ్‌ని ముందుంచుకొని ఆంద్రా ఓటర్లను ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నారు. మరి అటువంటప్పుడు బీజేపీ కూడా జనసేన అభ్యర్ధులను గెలిపించుకొనేందుకు తోడ్పడాలి కదా?
Also Read – నాడు పప్పూ అన్నారుగా… ఇప్పుడు భయపడితే ఎలా?
కనీసం పవన్ కళ్యాణ్ తన పార్టీ అభ్యర్ధుల కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్ళాలి కదా?కానీ కూకట్‌పల్లికి మాత్రమే పరిమితమైతే ఆ ఒక్క సీటు గెలిస్తే చాలనుకొంటున్నారా?
ఒకవేళ వారందరి తరపున పవన్ కళ్యాణ్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో హోరాహోరీగా పోరాడి ఓడిపోతే ఎవరూ వేలెత్తి చూపలేరు. కానీ పోరాడకుండానే ఓడిపోతే వేలెత్తి చూపకుండా ఉంటారా?తెలంగాణలో జనసేన ఓడిపోతే ఆ ప్రభావం ఏపీలో జనసేనపై పడకుండా ఉంటుందా?
Also Read – పుష్ప పై క్రెజే కాదు రూమర్లు తగ్గట్లా..!
ఇటువంటి అవకాశం కోసమే కాసుకు కూర్చొన్న వైసీపి ఎంపీ విజయ సాయిరెడ్డి, ఏపీ మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, రోజా, ఎమ్మెల్యే కొడాలి నాని వంటివారు చూస్తూ ఊరుకొంటారా?వారు చెలరేగిపోతే తెలంగాణలో ఓటమిని ఏపీ జనసేన ఎలా సమర్ధించుకోగలదు?ఏపీలో ఓటర్లకు ఎలా నమ్మకం కలిగించగలదు?అనే ప్రశ్నలకు జనసేనే జవాబు చెప్పాల్సి ఉంటుంది.