ఏ రంగంలోనైనా పురస్కారాలు వారి ప్రతిభ, సేవలు తదితర అంశాల ఆధారంగానే పురస్కారాలు లభిస్తుంటాయి. తాజాగా నోబుల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాపత్రయం చూస్తే నవ్వొస్తుంది. నిజానికి యావత్ ప్రపంచ దేశాలను కంటి చూపుతో శాశించగల అమెరికాకి అయన మళ్ళీ అధ్యక్షుడుగా ఎన్నికవడం కంటే గొప్ప బహుమతి, గుర్తింపు ఏముంటుంది?
కానీ ఏడు యుద్ధాలు ఆపిన శాంతి దూతగా ఈ అత్యున్నత పురస్కారం ఆశిస్తున్నారు. ఆయన అన్ని యుద్ధాలు ఆపలేకపోయినా వాటి జోరు తగ్గించగలిగారు. కనుక ప్రపంచ శాంతి కోసం ఆయన చేస్తున్న కృషికి తప్పకుండా గుర్తింపు లభించాల్సిందే.
ఆయన కృషిని నోబుల్ కమిటీ గుర్తించి అవార్డు ఇస్తే ఆయనకు ఎంతో గౌరవంగా ఉంటుంది. కానీ చంటిపిల్లాడు చాక్లెట్ కోసం మారాం చేసినట్లు నోబుల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ ఆరాటపడుతూ నవ్వులపాలవుతున్నారు.
నోబుల్ బహుమతి కోసం ఆయన బృందం లాబీయింగ్ చేసుకుంటే సరిపోయేదానికి ‘తప్పనిసరిగా నాకు నోబుల్ శాంతి బహుమతి ఇవ్వాలి… కావాలి,” అంటూ ట్రంప్ మాట్లాడుతున్నమాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. నోబుల్ బహుమతిని సాధించుకోవాలి కానీ అడుక్కుంటే ఏం బాగుంటుంది?
ఆయన అడిగినా అడగకపోయినా శాంతి స్థాపన కొరకు చేస్తున్న కృషిని నోబుల్ కమిటీ చూడకుండా ఉంటుందా?అంటే కానే కాదు. ఒకవేళ ఆయన కృషిని గుర్తిస్తే తప్పకుండా ఇస్తుంది కదా?
ఖమ్మం జిల్లాలో కోటి మొక్కలు నాటి అవి చెట్లుగా ఎదిగేవరకు సంరక్షించిన నిరుపేద, సామాన్యుడైన వనజీవి దరిపల్లి రామయ్య తనకు పద్మశ్రీ అవార్డు కావాలని అడిగారా? లేదు కదా?
అలాంటి సామాన్యులు తమ కృషి, ప్రతిభ, సేవలతో గొప్ప గొప్ప పురస్కారాలు అందుకున్నప్పుడు, అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న ట్రంప్ నోబుల్ శాంతి బహుమతి కోసం ఈవిదంగా ఆరాటపడటం అవసరమా? ఇది హాస్యాస్పదంగా ఉంది కదా?
దీని కోసం ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ప్రచారం చేసుకున్నా వాటిని తాము పట్టించుకోబోమని, నోబుల్ పురస్కార విజేతల ఎంపికలో ఒత్తిళ్ళకి లొంగే ప్రసక్తే లేదని నార్వేకి చెందిన ఐదుగురు సభ్యుల కమిటీ స్పష్టం చేసింది. కానీ నోబుల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ ఇంత ఆరాటపడుతున్నారు.
ఇన్ని మాటలు మాట్లాడి, ఇంత ఒత్తిడి, హడావుడి చేసిన తర్వాత ట్రంప్‌కి నోబుల్ శాంతి బహుమతి వచ్చినా రాకపోయినా చాలా అవమానమే. రాకపోతే అదో రకం అవమానం. వస్తే నుదుటన తుపాకీ గురిపెట్టి అవార్డు తీసుకున్నట్లే అవుతుంది కదా?




