‘అందాల రాక్షసి’ ఫేం రాహుల్ రవిచంద్రన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన “దృష్టి” సినిమా టీజర్ ను చిత్ర నిర్మాణ సంస్థ దీపావళి పర్వదినం సందర్భంగా విడుదల చేసారు. సస్పెన్స్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ను సరిగ్గా కట్ చేయడంలో చిత్ర యూనిట్ నూటికి నూరుపాళ్ళు సక్సెస్ అయ్యింది.
ఓ మర్డర్ నేపధ్యంలో సాగే కధగా కనపడుతోన్న “దృష్టి” సినిమాలో హీరో క్యారెక్టర్ కుంటివాడిగా కనపడడం విశేషం. ‘దువ్వాడ జగన్నాధం’ సినిమాలో వాడిన ‘స్ట్రెస్ రిలివర్’ను వెన్నెల కిషోర్ చేత వాడించిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక సస్పెన్స్ సినిమాకు ప్రాణమైన బ్యాక్ గ్రౌండ్ సంగీతాన్ని అందించడంలో నరేష్ కుమరన్ సక్సెస్ అయ్యాడు.
‘అందాల రాక్షసి’ సినిమా తర్వాత అనేక సినిమాలు చేసినప్పటికీ, ఒక్కటి కూడా సక్సెస్ కాకపోవడంతో, ఈ సారి రూట్ ను మార్చి సస్పెన్స్ దారి పట్టిన రాహుల్ కు “దృష్టి” సక్సెస్ ను అందించేలా ఉందన్న పాజిటివ్ బజ్ ను కలిగించడంలో టీజర్ విజయవంతం అయ్యింది. ఈ సినిమా ద్వారా అబ్బరాజు రామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.


