సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజుకున్న పేరు తెలియనిది కాదు. దిల్ రాజు నిర్మించిన సినిమాలే కాదు, ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా గానీ ప్రేక్షకులలో ఒక విధమైన పాజిటివ్ సంకేతాలు వ్యక్తమవుతాయి అని చెప్పడంలో సందేహం లేదు. అంతలా ఒక నిర్మాతగా ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఒకప్పుడు డి.రామానాయుడు ‘సురేష్ ప్రొడక్షన్స్’ సంస్థపై మాత్రమే ప్రేక్షకులకు ఇంత విశ్వాసం ఉండేది.
మరి అంతలా పేరు తెచ్చుకున్న దిల్ రాజు, తాజాగా నిర్మించిన “దువ్వాడ జగన్నాధమ్” సినిమాతో వివాదాలకు కేంద్ర బిందువుగా మిగులుతున్నారు. సినిమా విడుదలకు ముందు వరకు బ్రాహ్మణ సంఘాలు ఈ సినిమాపై ఆందోళన చేయగా, విడుదలైన తర్వాత దిల్ రాజు ప్రకటించిన కలెక్షన్స్ తో మరోసారి చర్చనీయాంశంగా మారిపోయారు. నిజానికి ఇప్పటివరకు దిల్ రాజు ఏ సినిమాకు కలెక్షన్స్ ను ప్రకటించలేదు.
పాతికేళ్ళ తర్వాత టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాను నిర్మించి, సక్సెస్ చేసిన సందర్భంలో కూడా గర్వంగా ఏనాడూ కలెక్షన్స్ వివరాలు ప్రకటించని దిల్ రాజు, తన 25వ సినిమా అయిన “డీజే” విషయంలో ఎందుకు నోరు జారినట్లు? భారీ డివైడ్ టాక్ రావడంతో, దానిని అధిగమించేలా కలెక్షన్స్ ఉండాలని తొందరపడ్డారా? ఊహించని రీతిలో కలెక్షన్స్ వచ్చేపాటికి, గర్వంగా చెప్పుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ప్రకటించారా?
ఇక్కడ కలెక్షన్స్ ప్రకటన తప్పు కాలేదు గానీ, ఓవరాల్ కలెక్షన్స్ ను చెప్పిన దిల్ రాజు, ఒక నిర్మాతగా ఏరియాల వారీగా కూడా ప్రకటించినట్లయితే, “దువ్వాడ జగన్నాధమ్” కలెక్షన్స్ పై ఇంత రచ్చ జరిగి ఉండేది కాదని చెప్పవచ్చు. నిజానికి ఈ సినిమా విడుదలైన తర్వాత వ్యక్తమైన పాజిటివ్ టాక్ కంటే, నెగటివ్ టాకే ఎక్కువ. అయినప్పటికీ కలెక్షన్స్ ఓ రేంజ్ లో ప్రకటించడమే “డీజే” కలెక్షన్స్ ను హాట్ టాపిక్ గా మార్చింది.
ఈ వివాదానికి శాశ్వతంగా తెర దించాలంటే… ఏరియాల వారీగా ఖచ్చితంగా ప్రకటన చేయాల్సి ఉంటుంది. లేదంటే తదుపరి పోస్టర్స్ లో కలెక్షన్స్ ప్రస్తావన లేకుండా విడుదల చేయాల్సి ఉంటుంది. బహుశా రాజు గారి ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే… రెండవ ఆప్షన్ నే ఎంపిక చేసుకునే అవకాశాలే ఎక్కువ! ఈ వారం ముగిస్తే ఎలాగూ ‘నాచురల్ స్టార్’ నాని నటించిన “నిన్ను కోరి” విడుదల అవుతుంది గనుక, సినీ ప్రేక్షకుల ఫోకస్ ఆ చిత్రంపైకి మళ్ళుతుంది.



