ఒకప్పుడు సినిమా పబ్లిసిటీ చేయాలంటే తలకు మించిన భారం. ఆడియో విడుదలైన నాటి నుండి దాదాపుగా నెల రోజుల వరకు రాత్రింబవళ్ళు పోస్టర్లు డిజైన్ చేయడం, వాటిని అర్దరాత్రి వేళల్లో గోడలపై అంటించడం, వాటిని చూస్తూ అభిమానులు మురిసిపోవడం… ఇవి జరిగేవి..! ఒకవేళ గోడ మీద పోస్టర్లు పడకపోతే, ఆ సినిమాకు మార్కెట్ వర్గాల్లో క్రేజ్ లేదని అర్ధం. కానీ ప్రస్తుతం అలాంటివేమీ లేవు. నిజానికి ఒకటి, అర ప్రాంతాలలో అలా పోస్టర్లు అంటిస్తున్నా, వాటిని చూసి సినిమాకు వెళ్ళే ప్రేక్షకులూ లేరు.
ఇప్పుడంతా డిజిటల్ యుగం. దీంతో సోషల్ మీడియా పబ్లిసిటీ కీలక పాత్ర పోషిస్తోంది. సోషల్ మీడియాలో ఒక సినిమాకు ఎంత క్రేజ్ ఉంటుందో, ఆ సినిమాకే భారీ ఓపెనింగ్స్ దక్కుతున్నాయి. దీనిని సమర్ధవంతంగా వినియోగించుకుంటే, ఎలాంటి ఫలితాలను రాబట్టవచ్చో అన్న విషయాన్ని “బాహుబలి” చిత్ర యూనిట్ ప్రాక్టికల్ గా నిరూపించి చూపించింది. దీంతో ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ చూపులన్నీ ప్రస్తుతం సోషల్ మీడియా వైపే ఉన్నాయన్నది అందరూ అంగీకరించాల్సిన సత్యం.
ఈ విషయాన్ని “దువ్వాడ జగన్నాధమ్” చిత్ర యూనిట్ కూడా చెప్పకనే చెప్పింది. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోన్న విషయాలను నిర్మాత దిల్ రాజు, దర్శకుడు హరీష్ శంకర్, హీరో అల్లు అర్జున్ లు ఎంత సీరియస్ గా తీసుకున్నారో, ‘థ్యాంక్యూ మీట్’లో వారు చేసిన ప్రసంగాలు చెప్పకనే చెప్పాయి. సోషల్ మీడియాలో ‘డీజే’ పట్ల జరిగిన ప్రచారం ఈ ఒక్క సినిమాకే పరిమితం కాలేదు. గతంలో చాలా సినిమాలకు జరిగిందే. అయితే అలాంటి వాటికి ప్రాధాన్యత కల్పిస్తూ ఏ ఒక్క హీరో గానీ, దర్శకుడు గానీ, నిర్మాత గానీ బహిరంగ ప్రకటనలు చేయలేదు.
కానీ ప్రస్తుత ట్రెండ్ లో సోషల్ మీడియాను, అందులోనూ ముఖ్యంగా ట్విట్టర్ ను సినీ సెలబ్రిటీలు చాలా సీరియస్ గా పరిగణిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో తన ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి అంశంపై హీరో నాగార్జున ఖండిస్తూ, వరుసగా ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. అలాగే హీరో రానా కూడా పలు అంశాలను కేవలం పుకార్లుగా కొట్టివేస్తూ ట్వీట్లు చేసారు. ఇక హీరోయిన్ల విషయమైతే చెప్పనే అవసరం లేదు. తాజాగా ‘డీజే’ చిత్ర యూనిట్ అయితే ఏకంగా బహిరంగ వేదికలపైనే సోషల్ మీడియా గురించి సుదీర్ఘ ప్రసంగం చేయడం అనేది… రాబోతున్న కాలంలో సినీ ఇండస్ట్రీకి సోషల్ మీడియానే దిక్కు అని వీరంతా చెప్పకనే చెప్తున్నారు.



