అత్త తిట్టినందుకు కాదు…. తోటి కోడలు నవ్వినందుకు ఏడుస్తున్నానాన్నట్లుంది దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్. జగన్మోహన్ రెడ్డికి ఇతర పార్టీలలోనే తన కంటే మంచి పేరు ప్రతిష్టలు వస్తుంటే చూసి సహించలేరు. అలాంటిది సొంత పార్టీలో నేతలు తన కంటే పాపులర్ అయితే భరించగలరా?
ఒకానొక సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి జగన్ తర్వాత రెండో స్థానంలో ఉన్నప్పుడు పార్టీలో, ప్రభుత్వంలో, బయట కూడా ఆయన పాపులారిటీ చాలా పెరిగిపోయింది.
జగన్ తన నీడని చూసి భయపడుతుంటారు కనుక విజయసాయి రెడ్డి ఆ విదంగా రాజకీయాలలో చక్రం తిప్పి పాపులార్ అవుతుంటే జగన్ తీవ్ర అభద్రతాభావానికి గురవడం సహజమే. కనుక ఆయనని ఢిల్లీకి పంపించేశారు. అందుకు వారిరువురూ వేరే కారణం చెప్పుకొని ఉండవచ్చు కానీ అసలు కారణం మాత్రం ఇదే.
కానీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురితో అక్రమ సంబంధం పెట్టుకొని విహార యాత్రలు, రీల్స్ చేస్తూ, టీవీ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తూ పాపులర్ అయితే, వారి ధైర్యానికి జగన్ నవ్వుకోవాలి కానీ ఆయనపై అసూయ పడాల్సిన అవసరం ఏమిటి?
ఒకవేళ ఆయన చేసింది తప్పని జగన్ భావిస్తే అప్పుడే పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉండాలి కానీ వారి వ్యవహారం బయటపడిన ఆరు నెలల తర్వాత దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీలో సస్పెండ్ చేయడం చూస్తే, వైసీపీలో ఎవరు ఏ రకంగా పాపులర్ అయినా జగన్ సహించలేరని స్పష్టమవుతోంది.
బహుశః అందుకే ఈ విషయం తెలిసిన గంట, అర గంట వైసీపీ వీరులందరూ పాపులర్ అయ్యే అవకాశాలను చేజేతులా జారవిడుచుకుంటున్నారేమో?ఆకు చాటు పిందెలా జగన్ చాటున కాలక్షేపం చేసేస్తూ ఆయన సిగ్నల్ ఇచ్చినప్పడు మాత్రమే ఆయన చెప్పిన అంశాల గురించి మాత్రమే ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడి వెళ్ళిపోతుంటారేమో? ఆయన కాలేరు ఇంకొకరిని కానీయారు. వైసీపీ నేతల పరిస్థితి ఎలా ఉందంటే అమ్మ అన్నం పెట్టదు. అడుక్కు తిననీయదన్నట్లు!




