చాలాకాలం తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. నిరాశతో, నిస్పృహతో ఉన్న ధియేటర్ల యాజమాన్యాలకు, ఎగ్జిబిటర్లకు, సినీ ప్రేక్షకులకు “ఎక్కడికి పోతావు చిన్నవాడా” సినిమా కొత్త ఉత్సాహాన్ని పంచుతోంది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకు తొలి రోజు నుండే ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టడం ప్రారంభించారు. అసలు ప్రేక్షకుడు ధియేటర్ కు వస్తాడా? రాడా? అన్న అనేక అనుమానాల నేపధ్యంలో వచ్చిన ‘చిన్నవాడిని’ ప్రేక్షకులు పెద్ద మనసుతో ఆశీర్వదించారు.
తొలి మూడు రోజుల్లో నిఖిల్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ తెచ్చిపెట్టిన సినిమాగా రికార్డులు సృష్టించిన “ఎక్కడికి పోతావు చిన్నవాడా” సినిమా మండే టెస్ట్ ను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. భారీ సినిమాలు సైతం మూడు రోజుల సినిమాలుగా మారిపోయిన నేపధ్యంలో… ఈ చిన్న సినిమాకు ప్రేక్షకులు పెద్ద విజయాన్ని అందించే సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఓ పక్కన నోట్ల కొరత ఉన్నప్పటికీ, సోమవారం నాడు చాలా సెంటర్లలో ‘హౌస్ ఫుల్’ బోర్డులు దర్శనమివ్వడంతో చిత్ర యూనిట్ ఆనందానికి అవధులు లేవని చెప్పాలి.
చూడబోతుంటే… నిఖిల్ కెరీర్ లో భారీ హిట్టుగా నిలిచిన “కార్తీకేయ” సినిమా రికార్డులను ఈ “ఎక్కడికి పోతావు చిన్నవాడా” బద్దలు కొట్టడం ఖాయంగా కనపడుతోంది. వినూత్నమైన కధలను ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకెళ్తున్న నిఖిల్ సినిమాలంటే ప్రేక్షకుల్లో మాంచి పాజిటివ్ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క హిట్టు కోసం మహా మహా వారసులంతా ముప్పతిప్పలు పడి మూడు చెరువులు నీళ్ళు తాగుతున్న తరుణంలో… వైవిధ్యభరితమైన సినిమాలకే ప్రేక్షకులు మొగ్గు చూపుతారన్న విషయాన్ని పసిగట్టి వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు నిఖిల్.



