రాజవైక్కల్ నీటి కాలువను ఆక్రమించుకున్న కేసులో ప్రముఖ సినీ నటుడు మాధవన్ కు మద్రాసు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో మాధవన్ తన భూమి పక్కన ఉన్న ఒక నీటి కాలువను ఆక్రమించుకున్నాడంటూ ఎన్.గణేశన్ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) క్రింద దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ కెకె శశిధరన్, జస్టిస్ బి.గోకుల్ దాస్ తో కూడిన బెంచ్ పరిశీలించింది.
అనంతరం మాధవన్ కు, జిల్లా కలెక్టర్ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 11వ తేదీకి వాయిదా వేసింది. కాగా, అయ్యం పౌలీ, బాల సముద్రం గ్రామాలకు ప్రధాన నీటి వనరుగా రాజవైక్కల్ నీటి కాలువ ఉంది. హీరో మాధవన్ నీటి కాలువనే కాకుండా ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించుకున్నాడని ఆ ఫిర్యాదులో ఆరోపించారు.
టాలీవుడ్ కు సుపరిచితమైన మాధవన్, తమిళ హీరో కాగా, ‘తను వెడ్స్ మను’ వంటి సూపర్ హిట్ సినిమాలలో బాలీవుడ్ లోనూ ప్రేక్షకాధారణ పొందారు. అంతేకాక, పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు మాధవన్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహిస్తున్నారు. అంతటి హోదాలో ఉన్న మాధవన్ పై వచ్చిన కబ్జా ఆరోపణలు నోటీసులు జారీ చేసే దాకా చేరుకోవడం విశేషం.



